కాన్ బెర్రా: బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. బాల్ ట్యాంపరింగ్ నిర్ణయం జట్టు మొత్తం కలసి తీసుకున్న నిర్ణయమేనని అంగీకరించిన స్టీవ్ స్మిత్‌ను ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తొలగించాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును ఆ దేశ ప్రభుత్వం కోరింది. అలాగే జట్టుపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
కేప్ టౌన్ టెస్టులో ఉద్దేశపూర్వకంగా బాల్ ట్యాంపరింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై విచారణ ముగిసిన వెంటనే చర్యలకు ఉపక్రమిస్తామని ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రకటించిన కొద్ది గంటల తరువాత, స్టీవ్ స్మిత్‌ను ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా తప్పించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం బోర్డును కోరింది.
ఆస్ట్రేలియా దేశ ప్రధాని మాల్కోమ్ టర్న్బుల్ ఈ సంఘటనను "షాకింగ్ డిసప్పాయింట్మెంట్" గా అభివర్ణించారు. "మేము ఈ ఉదయం దక్షిణ ఆఫ్రికా నుండి వచ్చిన వార్తలను విని ఆశ్చర్యపోయాము. నిరుత్సాహపడ్డాము" అని టర్న్బుల్ చెప్పారు. 'ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు చీటింగ్ చేసినట్లు కనిపించింది' అని అన్నారు.
Can we talk about this? pic.twitter.com/cmpRrOArgD
— Dale Steyn (@DaleSteyn62) March 24, 2018
Better view @DaleSteyn62 pic.twitter.com/L0wpnp6j9W
— Jerome Damon (@jerome_k_damon) March 24, 2018
"ఆస్ట్రేలియా క్రికెట్ ఛైర్మన్ డేవిడ్ పీయర్ తో నేను కొద్దిసేపటి క్రితం మాట్లాడాను. దక్షిణాఫ్రికాలో జరిగిన సంఘటనల గురించి నా నిరాశను, ఆందోళనలను చాలా స్పష్టంగా వ్యక్తం చేశాను' అని చెప్పారు. 'ఇది తప్పు. బాల్ ట్యాంపరింగ్ వార్త యావత్ దేశాన్నే నిరాశకు గురిచేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ త్వరలో చర్యలు తీసుకుంటుందని ఎదురు చూస్తున్నాను." అని అన్నారు.
ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ కమిషన్ (ఏఎస్సీ) చైర్ జాన్ వైలీ, ఏఎస్సీ బోర్డు, సీఈవో కేట్ పాల్మెర్ మాట్లాడుతూ, జట్టుపై తీవ్ర చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. 'ఏఎస్సీ ఏ క్రీడలోనైనా మోసాన్ని ఖండిస్తుంది' అని ఒక ప్రకటనలో తెలిపారు.