Mahalaya Paksham: భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. మహాలయ పక్షములో పితరులు అన్నాన్ని, ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన తిథి రోజున, మహాలయ పక్షములలో పితృ తర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే, పితృ దేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు. తమ వంశాభివృద్ధి జరుగును. వారు ఉత్తమ గతిని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు , నిర్ణయ దీపికా గ్రంథములు పేర్కొన్నాయి.
భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవ పదము, కృష్ణపక్షం పితృ పదము, అదే మహాలయ పక్షము.
మహాలయమంటే - మహాన్ అలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృ దేవతలకిది గొప్ప ఆలయము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థములున్నాయి.
అమావాస్య అంతరార్థం:
‘‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం. చంద్రుడు, సూర్యుడిలో చేరి, సూర్యుడితో పాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు.
భాద్రపద అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మ గ్రంథాలు తెలుపుతున్నాయి.
మహాలయ పక్ష ప్రారంభం నుండి పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి.
ఏ తిథిన ఎవరికీ
1. పాడ్యమి తిధి రోజు శ్రార్ధము పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.
2. విదియ లో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి.
3. తదియ లో శ్రార్థం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది.
4. చవితి రోజు శ్రాధ్ధము పెడితే పగవారు (శతృవులు) లేకుండా చేయును.
5. పంచమి రోజు శ్రార్ధము పెడితే సకల సౌభాగ్యములు కలుగజేయును.
6. షష్టి రోజు ఇతరులకు పూజ్యనీయులుగా చేయును
7. సప్తమి రోజు పరలోకంలో ఒక దేవగోష్టికి నాయకునిగా చేయును.
8. అష్టమీ రోజు మంచి మేధస్సును చేకూర్చును.
9. నవమి మంచి భార్యను సమ కూర్చును. గయ్యాళియైన భార్య కూడా బుధ్దిమంతురాలిని చేయును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును.
10. దశమి తిధి రోజు కోరికలను నేరవేర్చును.
11. ఏకాదశి రోజున సకల వేదవిద్యా పారంగతులను చేయును.
12. ద్వాదశి రోజున స్వర్ణములను, స్వర్ణాభరణములను సమ కూర్చును.
13. త్రయోదశి రోజున సత్సంతానాన్ని , మేధస్సును, పశు , పుష్టి , సమృద్ధి , దీర్ఘఆయుష్షు మొదలగు సకల సౌభాగ్యములను సమకూర్చును.
14. చతుర్దశి తిది రోజున వస్త్రం లేక అగ్ని (ప్రస్తుత కాలంలో రైలు , మోటారు వాహనములు వల్ల విపత్తు) వీని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధము చేయవలయును. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది.
15. అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్దించును
16. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తిచేసీ పరిపూర్ణతను చేకూర్చును.
ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్దాలు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి.
ఆర్దిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే, పితృ పక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయం లో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి , పితృ దేవతలకు నమస్కరించవచ్చు.
శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు , పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.