Wage Revisions Pending RTC Employees On Strike: దేశంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 14 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు నిరసనలకు దిగనున్నారు. జీతాల పెరుగుదల, బకాయి పడిన చెల్లింపులు, ఆర్టీసీ ప్రైవేటీకరణ వాటికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యారు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. జీతాల పెరుగుదల లేదు.. బకాయిల చెల్లింపులు జరగడం లేదు. సంస్థను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోంది. వీటన్నిటి నేపథ్యంలో ఉద్యోగులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
అధికారంలోకి 14 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించలేదు. ఒక్కరోజు కూడా సమీక్ష నిర్వహించలేదు.
సమస్యలపై పట్టించుకోకపోగా ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలు జరుగుతున్నాయనే ఆందోళన ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉండడంతో ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమయ్యారు.
పెద్ద ఎత్తున విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతుండడంతో వాటి నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగిస్తున్నారు. దీని ఫలితంగా ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా జీతాలు చెల్లిస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం తమను మోసం చేయడంపై బహిరంగ పోరాటాలకు సిద్ధమవ్వాలని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో సమ్మె నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతకుముందే జిల్లాల వ్యాప్తంగా నిరసనలు చేసేందుకు సిద్ధమైంది. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నారు.