Best uncapped indians players in Ipl 2024: ఐపీఎల్ 2024 సీజన్‌లో భారత యువ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల దుమ్మురేపుతున్నారు. వీరు త్వరలో టీమిండియాకు ఆడే అవకాశం ఉంది. ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇతడు 150కిమీ వేగంతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను భయపెడుతున్నాడు. లక్నో ఇతడిని రూ. 20 లక్షల బేస్ ధరకే కొనుగోలు చేసింది. ఇతడు మూడు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీశాడు.
ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ దుమ్మరేపుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో 63.60 సగటు, 161.42 స్ట్రైక్ రేట్‌తో 318 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో ఇతడికి చోటుదక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శశాంక్ సింగ్ 29 బంతుల్లో 61 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతడు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 73 సగటు మరియు 184.81 స్ట్రైక్ రేట్‌తో 146 పరుగులు చేశాడు.
ఈ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు అశుతోష్ శర్మ ఒకరు. అతడు మూడు మ్యాచ్ లలో 47.50 సగటు, 197.91 స్ట్రైక్ రేట్‌తో 95 పరుగులు చేశాడు. ఏప్రిల్ 4న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 17 బంతుల్లో 31 పరుగులు చేశాడు. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అశుతోష్ శర్మ 11 బంతుల్లో 50 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్లేయర్ అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. తన బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడుతున్నాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ ల్లో 35.17 సగటు, 197.19 స్ట్రైక్ రేట్‌తో 211 పరుగులు చేశాడు. ఇతడు త్వరలో టీమిండియా తలుపుతట్టే అవకాశం ఉంది.