Mahavir Jayanti History: జైన మతస్థులు మహావీర్ జయంతిని ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. జైనమతం యొక్క 24వ, చివరి తీర్థంకరుడైన లార్డ్ మహావీరుడి జన్మదినాన్ని సూచిస్తూ ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైన సమాజం వైభవంగా జరుపుకుంటారు. ఈరోజున ప్రజలు రథయాత్రలు నిర్వహిస్తారు.
భారతదేశంలో అనేక పురాతన జైన ఆలయాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా జైన మతస్థులు వర్ధమాన మహావీర జయంతిని ఎంతో భక్తి, శ్రధ్దలతో జరుపుకుంటారు. ఈరోజున జైన ఆలయాలను సందర్శిస్తారు. పేదలకు తమవంతుగా దాన ధర్మాలు చేస్తారు. తమ తీర్థంకరుడి గురించి ప్రవచనాలు వింటారు.
మహావీర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జైన సమాజం విస్తృతంగా జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, మహావీర్ జయంతిని మార్చి లేదా ఏప్రిల్లో జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మహావీర్ జయంతిని ఏప్రిల్ 21 (ఆదివారం) నాడు మహావీర్ జయంతిని నిర్వహించుకుంటున్నారు.
మహావీర్ జయంతి భగవాన్ మహావీరుడి జన్మదినాన్ని సూచిస్తుంది. మహావీరుడు.. వైశాలి రాజ్యంలో రాజా సిద్ధార్థ, రాణి త్రిషాలకు జన్మించాడు. శ్వేతాంబర్ జైనులు, దిగంబర్ జైనులలో అతని పుట్టిన తేదీ గురించి చర్చలు ఉన్నాయి. మహావీరుడు క్రీస్తు పూర్వం 599లో జన్మించాడని శ్వేతాంబర్ జైనులు విశ్వసిస్తే, దిగంబర్ జైనులు క్రీస్తుపూర్వం 615లో జన్మించారని నమ్ముతారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం, అతను చైత్ర మాసం 13వ రోజున జన్మించాడు.శ్వేతాంబర్ సమాజం విశ్వసిస్తున్నట్లుగా, లార్డ్ మహావీరుని తల్లి, రాణి త్రిశాల, 14 కలలు కంటుంది. జ్యోతిష్యులు ఆమె కలలను అర్థం చేసుకున్నారు. మహావీరుడు గొప్ప పరిపాలకుడు లేదా ఋషి (తీర్థంకరుడు) అవుతాడని వారు చెప్పారు.
30 సంవత్సరాల వయస్సులో, అతను తన సింహాసనాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్లిపోతాడు. 12 సంవత్సరాలు అడవులలో నివసించాడు. అజ్ఞాతవాసం చేస్తూ అహింస, సమానత్వాన్ని ప్రబోధించాడు. 72 సంవత్సరాల వయస్సులో, అతను జ్ఞానోదయం పొందాడని నమ్ముతారు.
మహావీరుడు అహింస, సత్యం యొక్క విలువలను ప్రజలకు బోధించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. దానికి 'అహింస', 'అస్తేయ', 'బ్రహ్మచార్య', 'సత్య', 'అపరిగ్రహ' అని పేర్లు పెట్టి ప్రజలకు బోధనలు చేశాడు. జైన సమాజానికి చెందిన ప్రజలు ఈ ప్రమాణాలను భక్తితో పాటిస్తారు. శాంతి, సామరస్య సందేశాన్ని దేశ వ్యాప్తంగా ఆయన వ్యాప్తి చేశారు. ఆయన బోధనలు నేటికీ కూడా జైనులు అనుకరిస్తుంటారు.