Independence Day 2024: ఆగస్టు 15న ఇండియా 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. రెండు వందల ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించిన రోజు అది. ఎందరో సమరయోధుల ప్రాణత్యాగానికి ఫలితమది. 1947 ఆగస్టు 15వ తేదీన ఆంగ్లేయులు ఇండియాను రెండు దేశాలుగా విభజించి వెళ్లిపోయారు. ఇండియా కాకుండా మరో 4 దేశాలు ఇదే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాయి. ఆ దేశాలేంటో తెలుసుకుందాం.
దక్షిణ కొరియా-ఉత్తర కొరియా దేశాలు కొరియాలో ఆగస్టు 15న జాతీయ విముక్తి దినోత్సవంగా జరుపుకుంటారు. 1945 నుంచి 35 ఏళ్ల పాటు నడిచిన జపాన్ పాలన నుంచి కొరియాకు స్వాతంత్య్రం లభించింది. ఈ రోజుని ఆ దేశాల్లో గ్వాంగ్బోక్జోల్ అని కూడా పిలుస్తారు. అంటే వెలుగులు ప్రసరించిన సమయం అని అర్ధం. జపాన్ నుంచి స్వాతంత్య్రం లభించి మూడేళ్లకు స్వతంత్య్ర కొరియా ప్రభుత్వం ఏర్పడింది.
రిపబ్లిక్ ఆఫ్ కాంగో కాంగో జాతీయ దినోత్సవం పేరుతో ఆగస్టు 15 జరుపుకుంటారు. 1960లో ఫ్రాన్స్ నుంచి పూర్తిగా స్వాతంత్య్రం పొందింది. ఫ్రాన్స్ పాలనలో 80 ఏళ్లు మగ్గింది ఈ దేశం. 1969 నుంచి 1992 వరకూ మార్క్సిజం లెనినిజం ఉండేది. తరువాత రిపబ్లిక్ రాజ్యమైంది
బహ్రెయిన్ 1971 ఆగస్టు 15న బ్రిటీషు పాలకుల నుంచి ఈ దేశానికి స్వాతంత్య్రం లభించింది. ఈ ఆయిల్ ఉత్పత్తి దేశాల్లో 1931లో ఆయిల్ అణ్వేషణ, రిఫైనరీ ఏర్పాటు చేసిన తొలి దేశమిది. బ్రిటన్, ఒట్టోమన్ ప్రభుత్వం దేశ స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇస్తూ సంధి చేసుకున్నాయి. కానీ బ్రిటీషు పాలనలోనే ఉండింది. 1971లో స్వాతంత్య్రం ప్రకటన తరువాత బ్రిటన్‌తో స్నేహపూర్వక సంధి కుదిరింది. ఆగస్టు 14నే స్వాతంత్య్ర ప్రకటన వెలువడినా..స్వాతంత్య్ర దినోత్సవం మాత్రం ఆగస్టు 15న జరుపుకుంటారు
లిక్టెన్స్టీన్ (Liechtenstein) 1866 ఆగస్టు 15వ తేదీన జర్మనీ నుంచి ఈ దేశం స్వాతంత్య్రం పొందింది. ఇది ప్రపంచంలోని ఆరవ అతి చిన్న దేశం. 1940 నుంచి ఆగస్టు 15వ తేదీని జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వేలాది ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు.