CM Jagan with YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధం వేడుక గోల్కొండ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. మేనల్లుడు రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థం వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు హాజరై.. కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో వైఎస్ విజయమ్మ కుటుంబ సభ్యులు సందడి చేశారు.
వేడుకలో పాల్గొనేందుకు గురువారం రాత్రి 8 గంటల సమయంలో రిసార్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తన సతీమణి భారతితో కలిసి నేరుగా ప్రధాన వేదిక వద్దకు వెళ్లారు.
అంతకుముందు తల్లి విజయమ్మను ఆప్యాయంగా హత్తుకుని మాట్లాడారు. పక్కనే ఉన్న చెల్లెలు షర్మిలను పలకరించారు.
ఈ సందర్భంగా గ్రూప్ ఫొటో దిగారు. షర్మిల కాస్త దూరంగా ఉండడం గమనించిన సీఎం జగన్ దగ్గరకు రావాలని సైగ చేశారు.
ఫొటో సెషన్ అనంతరం విజయమ్మ, షర్మిలను పలకరించి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు ముఖ్యమంత్రి జగన్.
సీఎం జగన్ నిశ్చితార్థ వేడుకకు హాజరైన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టనుండడంతో రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి.