7th Pay Commission DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతాల పెంపునకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఈ ఏడాదికి రెండో డీఏ పెంపు 3 నుంచి 4 శాతం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం డీఏ, డీఆర్ 53%-54%కి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక డీఏ పెంపుతోపాటు మరో ఐదు అప్‌డేట్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత ప్రయోజనాల చేకూర్చే దిశగా మోదీ సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డీఏ పెంపుతోపాటు రాయితీ ఛార్జీల పెంపు, కమ్యుటేషన్, కొత్త పే కమిషన్ ఏర్పాటు, సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీలలో సడలింపు వంటి నిర్ణయాలు పరిశీలనలో ఉన్నాయి.
ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెంచడంతో మొత్తం 50 శాతానికి చేరింది. ఇక రెండో డీఏ పెంపు మరికొద్ది రోజుల్లోనే ఉంటుంది. ఈ సారి 3-4% మధ్య ఉంటే.. మొత్తం 53%-54%కి చేరుతుంది. జీతాల పెంపు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.
డీఏ 3 శాతం పెరిగితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బేసిక్ పే రూ.18 వేలు ఉంటే జీతం రూ.540 పెరుగుతుంది. ఏడాదికి రూ.6,480 పెరుగుతుంది. రూ.56,900 బేసిక్ జీతం తీసుకునే ఉద్యోగులకు నెలవారీ జీతం రూ.1,707, వార్షిక వేతనం రూ.20,484 పెరుగుతుంది.
జూలై నెల నుంచి బకాయిలతో కలిపి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జీతం భారీ మొత్తంలో జమకానుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రకటన ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతి నెలా చివరి పనిదినం రోజు విడుదల చేసే AICPI ఇండెక్స్ సంఖ్యల ఆధారంగా డీఏ, డీఆర్ పెంపు ఉంటుంది. జనవరి నుంచి జూన్ డేటా ఆధారంగా జూలై డీఏ, జూలై-డిసెంబర్ డేటా ఆధారంగా జనవరి డీఏ పెంపు ఉంటుంది.
మరోవైపు 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తికావడంతో కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేస్తే.. దాని సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వస్తాయి.
ఇక సీనియర్ సిటిజన్లకు కరోనా సమయంలో నిలిపేసిన రైలు ఛార్జీల రాయితీని మళ్లీ అందించాలని డిమాండ్ ఉంది. ఈ నెలలోనే దీనికి సంబంధించి శుభవార్త వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో సీనియర్ సిటిజన్లకు భారీ ప్రయోజనం చేకూరుతుంది.
కమ్యుటేషన్‌పై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒక పెన్షనర్ కమ్యుటేషన్‌ని ఎంచుకుని మరణిస్తే.. అతని కుటుంబం పొందే పెన్షన్‌లో ఎలాంటి కోత విధించరు. ఉద్యోగుల కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకోనుంది.
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే రాసినది. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.