రఘునందన్ యండమూరి.. ఓ ఇండో అమెరికన్. 2012లో ఓ వృద్ధురాలితో పాటు ఆమె 10 నెలల మనవరాలిని కిరాతకంగా హత్య చేసిన కేసులో ఇతనికి మరణదండన విధించింది కోర్టు. ఈ ప్రవాస భారతీయుడికి జనవరి 23, 2018 తేదిన శిక్షను అమలు చేయనున్నామని పెన్సిల్వేనియా అధికారులు ప్రకటించారు. ఉద్యోగరీత్యా ఇంజినీరైన రఘునందన్ హెచ్1బీ వీసాపై యూఎస్ వెళ్లాడు. అక్కడ చెడు వ్యసనాలకు లోనవ్వడంతో పాటు ఎన్నో అప్పులు కూడా చేశాడు. ఆ అప్పుల బాధ భరించలేక 2012లో డబ్బు కోసం వెన్న సాన్వీ అనే పది నెలల చిన్నారిని అపహరించాడు.
కిడ్నాప్ చేస్తున్న క్రమంలో ప్రతిఘటించిన పాప నాయనమ్మ సత్యవతి (61)ని హత్య చేసిన రఘునందన్... పోలీసులు అరెస్టు చేసి విచారణ చేసినప్పుడు తాను అమాయకుడినని నమ్మబలికాడు. ఆ తర్వాత పాపను సూట్ కేసులో బంధించి ఊపిరాడకుండా చేసి చంపానని తెలిపాడు. అయితే పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ వుల్ఫ్ చాలా కాలం క్రితమే మరణశిక్షలపై మారటోరియం (నియంత్రణ సూచనలు, నిలుపుదల కారణాలు) విధించినట్లు పలు పత్రికలు రాయడంతో రఘునందన్‌కు మరణశిక్ష పడుతుందా లేదా.. అన్న అంశంపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెన్సిల్వేనియాలో 1999 తరువాత ఇప్పటి వరకూ ఎలాంటి మరణశిక్షనూ అమలు చేయలేదు. ప్రస్తుతం ఆయన మరణశిక్ష అమలు కావడానికి ఇంకా మూడు రోజులు సమయం ఉన్నందున.. కోర్టు నుండి ఎలాంటి ఉత్తర్వులు అందుతాయన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బహుశా ఆ శిక్ష వాయిదా పడే అవకాశం ఉందని కూడా పలు పత్రికలు రాయడం గమనార్హం.