"స్పెల్లింగ్ బీ"లో మళ్లీ మనోడే విజేత

అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే "నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ ఛాంపియన్‌షిప్‌"లో మళ్లీ భారతీయ సంతతి బాలుడే సత్తా చాటాడు. 

Last Updated : Jun 1, 2018, 01:45 PM IST
"స్పెల్లింగ్ బీ"లో మళ్లీ మనోడే విజేత

అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే "నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ ఛాంపియన్‌షిప్‌"లో మళ్లీ భారతీయ సంతతి బాలుడే సత్తా చాటాడు. 14 ఏళ్ల కార్తీక్ నెమ్మని ఈ ఘనతను సాధించి 14వ సారి భారతీయ సంతతి వ్యక్తి ఈ టైటిల్ గెలుచుకొనేలా చేశాడు.  టెక్సాస్‌లోని మెక్‌కిన్నీ ప్రాంతంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న కార్తీక్‌కు ఈ పోటీల్లో  మరో భారతీయ సంతతికి చెందిన బాలిక నయాసా మోదీ గట్టి పోటీనే ఇచ్చింది.

అయితే ఆఖరి రౌండ్లో ‘koinonia’ అని పదాన్ని సరిగ్గా పలికి ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్నాడు కార్తీక్. గతేడాది కూడా ఈ ఛాంపియన్‌షిప్‌‌ను భారతీయ సంతతికి చెందిన బాలిక అనన్య వినయ్‌ గెలుపొందింది. ప్రస్తుతం "స్పెల్లింగ్ బీ" ఛాంపియన్‌గా గెలిచిన కార్తీక్‌కు 42వేల అమెరికా డాలర్లు బహుమతిగా ప్రకటించారు. "స్పెల్లింగ్ బీ" విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీని కూడా అందిస్తారు. అలాగే మెరియం-వెబ్‌స్టర్‌ నుంచి 2,500 డాలర్ల నగదు బహుమతితో పాటు వారి రిఫరెన్స్ లైబ్రరీకి ఫ్రీ యాక్సెస్ కూడా ఇస్తారు.

"స్పెల్లింగ్ బీ" గెలుపొందే చిన్నారులకు దక్కే ఆఫర్లు చాలా ఎక్కువ. వారికి ఒక సెలబ్రిటీ స్టేటస్ దక్కుతుంది. వివిధ దేశాలను పర్యటించే అవకాశంతో పాటు.. ఇంటర్వ్యూలు, హాలీవుడ్‌లో ప్రముఖులతో భేటీలు లాంటి అవకాశాలను గతంలో "స్పెల్లింగ్ బీ" విజేతలు పొందారు. ఈ సారి రికార్డు స్థాయిలో "స్పెల్లింగ్ బీ" పోటీల్లో 516 మంది పాల్గొన్నారు. ఈ ఏడాది "స్పెల్లింగ్ బీ" విజేత కార్తీక్ తన మనసులోని భావాలను మీడియాతో పంచుకున్నారు. గత కొంతకాలంగా తాను కన్న కల నిజం కావడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. 

Trending News