CM KCR On Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పందించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు అని అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయమని అన్నారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని కేసీఆర్ అన్నారు.
"మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బిజేపి ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి.." అని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రధాని మోదీపై మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌పై అనర్హత వేటు మోడీ నియంతృత్వానికి పరాకాష్ట అని అన్నారు. మోడీ అసలు స్వరూపం బట్టబయలు అయిందన్నారు. దేశంలో చీకటి రోజులు అని.. అణిచివేత మోడీ సర్కార్ ఎంచుకున్న మార్గం అని అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేతకే ఈడీ, ఐటీ, సీబీఐలను వాడుకుంటున్నారని అన్నారు. దొంగలకు మోడీ ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారన్నారని ఆరోపించారు. పార్లమెంటులో అక్రమాలను ప్రశ్నిస్తారనే భయం మోడీకి పట్టుకుందన్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీని పార్లమెంట్‌లో అనుర్హుడిగా ప్రకటించారని అన్నారు. ఎనిమిదేళ్లుగా బిజెపి ప్రభుత్వం చేస్తున్న తంతు అదేనని.. దేశంలో కుల మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతుందని ఫైర్ అయ్యారు. బీజేపీ దుర్మార్గాలకు ప్రజలు చరమ గీతం పాడుతారని జోస్యం చెప్పారు.
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించడతో లోక్‌సభ సభ్యుడిగా రాహుల్‌ను అనర్హుడిగా లోక్‌సభ సెక్రటరీ ప్రకటించారు. కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో దేశంలో దొంగలందరికీ మోడీ ఇంటి పేరు ఎలా వచ్చింది..? అంటూ రాహుల్ గాంధీ కామెంట్స్ చేయగా.. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు అయింది. ఈ కేసు విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఖండిస్తున్నారు.
Also Read: Rahul Gandhi: సంచలన నిర్ణయం.. రాహుల్ గాంధీపై వేటు.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు
Also Read: YSRCP MLAs Suspended: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు.. ఆ ఇద్దరు వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి