బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బాలాసోర్ వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా భువనేశ్వర్, పూరీ, కడక్లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భువనేశ్వర్ మీదుగా విశాఖ వచ్చే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే.. ఉత్తర కోస్తా ప్రాంతంలో కూడా వర్షాలు కురవనున్నాయి. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కూడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలిక పాటి నుంచి మొస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, తీరప్రాంతంలో తీవ్రంగా అలల ఉద్ధృతి పెరిగిందని, చేపల వేటకు మత్స్యకారులు వెళ్లొద్దని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఆకాశం మేఘావృతమైంది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు వంశధారలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తడంతో, అధికారులు 175 గేట్లు ఎత్తేసి నీరు సముద్రంలోకి విడుదల చేయనున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.