మానవత్వమా.. ఏదీ నీ చిరునామా..!

 ఈ లోకంలో మూగజీవాల బతుకుపోరు అనే విషయం నిజంగానే పాఠ్యాంశాలలో పెట్టాల్సిన తప్పనిసరి అంశంగా తయారైంది. ఎందుకంటే మనిషి పూర్తిగా మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. తను చిన్నప్పుడు నేర్చుకున్న నీతిపాఠాలను గాలికొదిలేసి.. స్వార్థపరుడిగా కాలం వెళ్లదీస్తు్న్నాడు.

Last Updated : Jul 7, 2018, 09:23 PM IST
మానవత్వమా.. ఏదీ నీ చిరునామా..!

బాబు కొయిలాడ, సీనియర్ కరస్పాండెంట్, జీన్యూస్

అవును.. మానవత్వానికి, మమతకు కాలం చెల్లింది. మనిషి గుండె కూడా కరడుకట్టిన పాషాణంలా రోజు రోజుకీ తయారైపోతోంది. ప్రతీ రోజూ దిక్కూ మొక్కూ లేని అనేకమంది అభాగ్యులను మనం రోడ్ల మీద, ఫుట్‌పాత్‌ల మీదా చూస్తూనే ఉంటాం. ఎండనకా, వాననకా తడిసి వారి బతుకేదో వారు బతకాల్సిందే తప్పితే.. వారిని ఆదుకొనే నాథులే ఉండరు. ఇక అనాథ శరణాలయాలు కూడా ఎంతమందిని చేర్చుకొని సేవ చేయగలవు అన్నది కూడా ప్రశ్నే. ఇక సాటి జనుల పరిస్థితే ఇలా ఉంటే.. మూగజీవాల పరిస్థితి మరింత దారుణం. రోడ్డు మీద తిరిగే కుక్కలు, గొడ్డుపోయిన ఆవుల సంగతి సరే సరి. జీవుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని.. అవీ సమాజంలో ఒక భాగమేనని మనిషి గుర్తించేదెప్పుడు..? బాబాలకు, స్వాములకు, ఆలయాలకు కోట్లాది రూపాయలను దానాలుగా వెచ్చించే కొందరు జనులు జీవాత్మలోనే పరమాత్మ ఉందనే విషయాన్నే మర్చిపోయారా.. ఇవ్వన్నీ ఈ రోజు సమాధానం లేని ప్రశ్నలే..! 

పశు, పక్ష్యాదులపై ప్రేమను చూపించే రోజులు పోయి.. వాటిని హింసించి ఆనందం పొందే పైశాచిక వ్యక్తులుగా ఈ రోజు అనేకమంది తయారవుతున్నారు. ఇటీవలే బెంగళూరులో జరిగిన ఓ సంఘటన ఈ పరిస్థితికి అద్దం పడుతుంది. ఎవరో అవసాన దశలో ఉన్న ఓ శునకానికి చెందిన వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దానిని శతవిధాల కాపాడడానికి అనేక జంతు సంక్షేమ సంఘాలకు, జీవ కారుణ్య సంఘాలకు కూడా ఆ పోస్టును ట్యాగ్ చేశారు. ఎన్నాళ్ళ నుండో రోగాలకు, రొష్టులకు లోనై చిక్కి శల్యమైపోయిన ఆ శునకం తిండి తిని ఎన్నాళ్లయిందో..! శక్తినంతా కూడగట్టుకొని నడవడానికి ఆపసోపాలు పడుతూ నాలుగు వీధులు తిరిగి తన తిండి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న దానిని అందరూ కొట్టడానికి ప్రయత్నించేవారే. చంపడానికి నడుం బిగించేవారే.. అందుకేనేమో ఈ పాపపు లోకాన్ని చూడలేక ఆ జీవి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. తర్వాత ఇదే అంశంపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. ఆ శునకానికి అంత్యక్రియలు జరపడానికి కొందరు ముందుకొచ్చారు.

బెంగూళూరులో జరిగిన ఘటనకు సంబంధించిన ఫేస్ బుక్ లింక్

 

 

కానీ అసలు సమస్య ఇది కానేకాదు. ఈ లోకంలో మూగజీవాల బతుకుపోరు అనే విషయం నిజంగానే పాఠ్యాంశాలలో పెట్టాల్సిన తప్పనిసరి అంశంగా తయారైంది. ఎందుకంటే మనిషి పూర్తిగా మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. తను చిన్నప్పుడు నేర్చుకున్న నీతిపాఠాలను గాలికొదిలేసి.. స్వార్థపరుడిగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇక ఇలాంటి విషయాల్లో ఎన్జీఓల పాత్ర ఏంటన్నది కూడా చర్చించదగ్గ అంశంగా మారిపోయింది. ఎందుకంటే ఈ లోకంలో మనిషితో పాటు అన్ని జీవాలకూ స్వతంత్రంగా బతికే హక్కు ఉంది. మరి వాటి స్వతంత్రానికి భంగం కలుగుతుంటే.. ప్రభుత్వమే రాసిన చట్టాలు, నిబంధనలు ఏం చేస్తున్నాయన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. 'ప్రాణాతిపాతా వేరమణీ సిఖ్ఖాపదం సమాధియామి'' అని గౌతమ బుద్ధుడు చెప్పినట్లు ''జీవులు జీవించే హక్కును హరించను అనే నియమాన్ని పాటిస్తాను'' అని నిజంగానే ప్రతిజ్ఞ చేసే ధైర్యం జనాలకు ఉందా.. అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ రోజు మనిషన్నవాడు నిజంగానే మాయమైపోతున్నాడు. వేగవంతమైన జీవనంలో.. యాంత్రిక జీవితంతో సతమతమవుతూ తన కోసం తానే జీవిస్తున్నాడు.అందుకే సాటి జీవుల గురించి ఆలోచించే సమయమే మావద్ద ఉండదు అని కొందరు అన్నా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. 

దీనికి ఒక్కటే పరిష్కారం. మానవత్వాన్ని అభిలషించే ప్రభుత్వాలు జీవకారుణ్య విషయంలో నిబంధనలను మరింత కఠినతరం చేయాలి. మూగజీవాల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారికి కఠిన శిక్షలు విధించాలి. జనులు కూడా సాధ్యమైనంత వరకూ తమవల్ల ఏ జీవికి కీడు జరగకుండా ఉండేలా చూసుకోవాలి. అలాంటి సంఘటనలు ఎదురుపడితే ఖండించాలి. మూగజీవాల పట్ల కారుణ్యాన్ని పెంచే సేవా సంస్థలు కూడా ప్రేమతత్వంలోని గొప్పతనాన్ని చాటాలి. ఈ రోజు సోషల్ మీడియాలో జీవ కారుణ్య విషయంలో మంచి, చెడూ రెండింటినీ ప్రజలు గమనిస్తున్నారు. కేవలం ఒక రోజు మూగజీవాల ఆకలి తీర్చినంత మాత్రాన అది గొప్ప కార్యం అనిపించుకోదు. వాటిని దత్తత తీసుకొనే సాకే వ్యక్తులు నిజంగా పూజనీయులే. ఇలాంటి సంస్థ కార్యక్రమాల్లో యువతీ, యువకులు పాలుపంచుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. అయితే ఈ జీవ కారుణ్య సందేశం సాధ్యమైనంత ఎక్కువమందికి చేరితేనే ఫలితం ఉంటుంది. అయితే.. మనిషిలో మానవత్వం పూర్తిస్థాయిలో పరిమళించినప్పుడే అది సాధ్యమవుతుంది.

ఈ క్రమంలో నిజంగానే జీవ కారుణ్యానికి, మానవత్వానికి చిరునామాగా నిలిచిన పలువురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం..!
ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ప్రతిమా దేవి అనే మహిళ, తన ఇంటి వసారాని వీధి కుక్కల కోసం కేటాయించారు. వాటికి తన సంపాదనలో కొంత భాగాన్ని కేటాయిస్తూ.. ఆహారాన్ని, మందులను అందిస్తున్నారు. 

ప్రముఖ సోషల్ వర్కర్ బాబా ఆమ్టే కుమారుడు, తన నివాసం వద్దే గాయాలబారిన పడి జనావాసాల్లోకి వచ్చే అడవి జంతువులకు వైద్యం చేస్తూ... వాటిని కొన్నాళ్లు సంరక్షించడం కోసం ఒక పార్కును నిర్మించారు.

 

Trending News