ఆమె పేరు ఆండర్సన్ సెయిర్రా.. వయసు 29 ఏళ్లు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం బేవెర్టన్ లో నివాసం ఉంటుంది. ఆమెకు తల్లిపాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుందట. అందుకే వృధా చేయకూడదని భావించి దానం చేయాలని నిర్ణయం తీసుకుంది. తల్లిపాలకు నోచుకోని ఎందరో చిన్నారులకు అమ్మలా ఆదుకుంటోంది.
ఇంతటి గొప్ప నిర్ణయం ఎలా తీసుకున్నారు? అని ఆమెను ప్రశ్నించగా.. "నాకు ఇద్దరు పిల్లలు. తొలి పాప నెలలు పూర్తికాకుండానే పుట్టింది. ఆ సమయంలో పాల ఉత్పత్తి సరిగా లేకపోవడంతో దాతలను ఆశ్రయించాను. కానీ రెండో పాప పుట్టినప్పుడు దాతలమీద ఆధారపడాల్సిన అవసరం రాలేదు. పాపకు పాలు అందించే స్థితిలో ఉన్నాను. పైగా తల్లిపాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడంతో వృధా చేయకూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నాను" అని చెప్పారు.
ఆండర్సన్ రోజుకు ఐదుసార్లు పాలను సేకరిస్తుంది. ఇందుకోసం ఆమెకు రోజుకు 8 గంటల సమయం పడుతోంది. ఉదయం లేచిన తరువాత, టిఫిన్, లంచ్, డిన్నర్ చేసిన తరువాత, అర్థరాత్రి తరువాత పాలను సేకరిస్తారు. రోజుకు 1.7 గ్యాలన్ల (ఆరు లీటర్లు) పాలను సేకరించి ప్యాకెట్లలో ఫ్రిజ్ లో నిల్వ చేస్తారు. ఇప్పటివరకు 600 గ్యాలన్ల తల్లిపాలను సరఫరా చేశారు. అవసరమైన వారిని పాలను సరఫరా చేసి మిగిలిన వాటిని మిల్క్ బ్యాంక్ కు పంపిస్తారు. పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న తల్లులు తల్లిపాలను దానం చేయాలని ఆండర్సన్ కోరారు.