Revanth Reddy's Speech: బోయినపల్లిలో బుధవారం జరిగిన గాంధీ ఐడియోలజిలో నిర్వహించిన ఒకరోజు కాంగ్రెస్ శిక్షణ శిబిరం తరగతులకు సీనియర్ల టీం మళ్ళీ హాజరు కాలేదు. రేవంత్ రెడ్డికి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే సీనియర్ల టీం జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు, గీతా రెడ్డిలు హాజరుకాలేదు. దీంతో సీనియర్ల గైర్హాజరుపై రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ఒకరోజు శిక్షణ తరగతులకు ఎవరైతే హాజరు కాలేదో వారికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటి షో కాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలోజి కేంద్రంలో ఒక రోజు శిక్షణా తరగతుల కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటతో కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణా కార్యక్రమం కొనసాగింది. ధరణి, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్ మీడియా లాంటి అంశాలపై చర్చించారు.
ప్రాణాలకు తెగించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దేశసరిహద్దులను ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకుండా అలాంటిదేమీ లేదని చెప్పడం దురాక్రమణలకు అనుమతి ఇచ్చినట్లే అవుతుందని అగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌కు కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని,ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా పదవి స్వీకరించలేదని, దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా అందించారని గుర్తుచేశారు. ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని, దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి యాత్ర చేస్తున్నారని, జనవరి 26న జెండా ఎగరేయడంతో బాధ్యత తీరలేదని అందుకే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం 'హాత్ సే హాత్ జోడో 'అభియాన్ కార్యక్రమం చేపట్టాలని సూచించిందని తెలిపారు. ప్రతీ గడపకు రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనె లక్ష్యంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచెయ్యాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రతిష్టను పెంచేలా సందేశాన్ని తీసుకెళ్ళాల్సిన బాధ్యత నాయకులపై ఉందని అన్నారు. ఓటరు లిస్టులో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తే వాటిని తిరిగి చేర్పించాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేస్తున్నామని అన్నారు.
బండ్లతోని, గుండ్లతోని అయ్యేది ఏం లేదన్న రేవంత్ రెడ్డి
నిపుణులు అందరి సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని, 2003 లో ఎలాంటి విపత్కర పరిస్థితులనైతే ప్రజలు ఎదుర్కొన్నారో 2023లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని ఈ పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించాలి అంటూ ఈసారి అధికారంలోకి కాంగ్రెస్ వస్తుందని గళాన్ని వినిపించారు. తామంతా కష్టపడితే కేసీఆర్ ఒక లెక్క అని చెప్పి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. బండ్లతోని, గుండ్లతోని అయ్యేది ఏం లేదని తమ రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చంద్రబాబుతో కలిసిపోతారనే ఆరోపణలకు సమాధానమే ఆ వ్యాఖ్యలా ?
అయితే చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డికి అమితమైన అభిమానమని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో జండా పాతెందుకు పావులు కదుపుతుందని ఎక్కడ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటీ అంటారేమో అని ముందుగానే హింట్ ఇస్తూ రేవంత్ రెడ్డి, చంద్రబాబు పేర్లను ముడిపెడుతూ ఇతర రాజకీయ వర్గాలలో చర్చలు, ఆరోపణలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఒకపక్క కాంగ్రెస్ లీడర్లు మాత్రం తామంతా కలిసికట్టుగానే ఉన్నామని జీర్ణించుకోలేనటువంటి ఇతర రాజకీయ పార్టీలు ఇలాంటి పుకార్లు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ విస్మయం వ్యక్తంచేశారు. సీనియర్లకు కొంత పని ఉండడం వల్లనే రాలేదని దానికి ఇతర పార్టీలు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నాయో అంటూ మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సంభాని చంద్రశేఖర్, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాములు నాయక్, నిరంజన్, పీఏసీ, పిఈసి సభ్యులు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్‌లు, పీసీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Revanth Reddy: కాంగ్రెస్ శిక్షణ తరగతులకు సీనియర్లు డుమ్మా.. హై కమాండ్ సీరియస్
ప్రాణాలకు తెగించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
బండ్లతోని, గుండ్లతోని అయ్యేది ఏం లేదన్న రేవంత్ రెడ్డి
శిక్షణా కార్యక్రమం మధ్యలో చంద్రబాబు ప్రస్తావన