సినీనటి, పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ తాను ట్విట్టర్‌కి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఆమె తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశారు. రోజు రోజుకీ ట్విట్టర్‌లో నెగటివిటీ పెరిగిపోతుందని.. తనకు ప్రతికూలంగా చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె అన్నారు. తాను కొత్త జీవితం ప్రారంభించాలనే యోచనతో ఉన్నానని.. ఈ క్రమంలో నెగటివిటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నానని.. అందుకే ఆ ఖాతాను డిలీట్ చేస్తున్నానని ఆమె తెలిపారు. త్వరలోనే రేణూ దేశాయ్ ద్వితీయ వివాహం చేసుకోనున్నారు. ఇటీవలే ఆమె నిశ్చితార్థం కూడా జరిగింది.
ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమేనని రేణు దేశాయ్ అన్నారు. ఇటీవలే రేణుదేశాయ్ తన నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫోటోని కూడా పోస్టు చేశారు. అయితే ట్విట్టర్ ఖాతా డిలీట్ చేసిన రేణూ దేశాయ్, ఫేస్బుక్‌లో మాత్రం యాక్టివ్‌గానే ఉన్నారు.
ట్విట్టర్ ఖాతా డిలీట్ చేస్తున్న సందర్భంగా రేణు దేశాయ్ తన మనసులోని మాటలను పంచుకున్నారు. "ట్విటర్‌లో చాలా ఎక్కువ నెగిటివిటీ ఉందని నాకు అనిపించింది. ఇక్కడున్న వారు దాదాపు అజ్ఞాత వ్యక్తులే. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చిరాకుతో ఉన్న వారు. సినిమా వారి గురించి, రాజకీయ నాయకుల గురించి ఎప్పుడు ప్రతికూలంగా రాయడానికి ఇష్టపడుతుంటారు’.
‘నేను నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈ సమయంలో ఓ నిర్ణయానికి వచ్చా. నెగిటివిటీకి దూరంగా ఉండేందుకు నా ట్విటర్‌ను డీయాక్టివేట్ చేయాలని నిర్ణయించుకున్నా. నా మంచి కోరుతూ నన్ను అర్థం చేసుకుని, ప్రతికూల పరిస్థితిలో నాకు తోడుగా నా వెంట ఉన్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు" అని రేణు దేశాయ్ తెలిపారు.