ఆంధ్రా డీజీపీ మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ చోరీ కేసులో ప్రకాశం జిల్లా చీరాల మండలం ఆదినారాయణపురం చెందిన కావటి అలిమేలు అనే మహిళను నిందితురాలిగా అనుమానిస్తూ ఏపీ పోలీసులు అరెస్ట్ చేయగా కర్నూలు జిల్లా ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి గత నెలలో శ్రీశైలంలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆమెను మీడియా ఎదుట ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. అయితే తన తల్లిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన తీరుపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆమె కొడుకు కావటి సాగర్ హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే తన తల్లిని కోర్టులో హాజరుపరిచి, డీఎస్పీ మాధవరెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా పిటిషనర్ కోర్టుని కోరారు. తన పిటిషన్లో కర్నూలు, ప్రకాశం జిల్లాల ఎస్పీలు, నందికొట్కూరు కానిస్టేబుళ్లు ఆచార్య, శ్రీను, బషీర్, నాగరాజు, చీరాల టూ టౌన్ కానిస్టేబుళ్లు శ్రీను, మహేష్, తదితర వ్యక్తులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
కావటి సాగర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ నాగాగ్జున రెడ్డి, జస్టిస్ జి శ్యామ్ ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం నిందితులను, అనుమానితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన తీరుపై పోలీసులను తప్పుపట్టింది. నిందితుల్ని, అనుమానితుల్ని మీడియాకు చూపించే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేస్తూ అసలు ఏ అధికారంతో వారిని మీడియా ఎదుటకు తీసుకొస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ డీజీపీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.