Hyderabad Traffic New Rules: హైదరాబాద్ సిటీలో వాహనదారులు ఎప్పటికంటే మరింత ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం వచ్చేసింది. లేదంటే మీ నెల జీతం ట్రాఫిక్ ఫైన్స్ చెల్లించడానికి కూడా సరిపోదు సుమీ. ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త మార్గదర్శకాలు జారీచేశారు. ఇకపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ కి, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారు భారీ మొత్తంలో జరిమానా చెల్లించుకోవాల్సిందే. అదే కానీ జరిగితే ఇక మీ జేబుకు పెద్ద చిల్లు పడ్డట్టే.
హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారికి మోటారు వెహికిల్ చట్టంలోని సెక్షన్ 119/ 177 & 184 కింద రూ.1700 ( 200 + 500 + 1000 ) జరిమానా చెల్లించాల్సిందే. ఒకవేళ ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడితే.. రూ. 1200 జరిమానా చెల్లించుకోవాల్సిందే. వాహనదారులు ట్రాఫిక్ గైడ్ లైన్స్ సరిగ్గా పాటించి సురక్షితంగా గమ్యం చేరేలా చేయడం కోసమే ఈ కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టంచేశారు.
ఈ నెల 21 నుంచి రాంగ్ సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్ ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. అనంతరం 28వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి జరిమానా విధించనున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ స్పష్టంచేశారు.
2020లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా, ట్రిపుల్ రైడింగ్ వల్ల జరిగిన ప్రమాదాల్లో 24 మంది చనిపోయారు. 2021లో డేటాను పరిశీలిస్తే.. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 21 మంది చనిపోగా.. ట్రిపుల్ రైడింగ్ కారణంగా జరిగిన ప్రమాదాల్లో 15 మంది దుర్మరణం పాలయ్యారు.
ఇక ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న డేటాను గమనిస్తే.. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికే 15 మంది చనిపోయారు. ఇది 2020 సంవత్సరం మొత్తంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల చనిపోయిన వారి సంఖ్యతో సమానం. అలాగే ట్రిపుల్ రైడింగ్ వల్ల 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా రాంగ్ సైడ్ డ్రైవింగ్, త్రిపుల్ రైడింగ్ కారణంగా ప్రమాదవశాత్తుగా సంభవిస్తున్న ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ గణాంకాలతో సహా వివరించారు.
Traffic New Rules: ట్రాఫిక్ కొత్త రూల్స్.. రాంగ్ సైడ్‌కి 1700, ట్రిపుల్ రైడింగ్ 1200
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జేబుకు మరింత పెద్ద చిల్లు
రాంగ్ సైడ్ డ్రైవింగ్, త్రిపుల్ రైడింగ్‌కి పెద్ద మొత్తంలో చిలుము వదిలించుకోవాల్సిందే
ఈ నెల 28 నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్