Jagadish Reddy Gets EC Notice: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించారని ఈ నోటీసుల్లో పేర్కొన్న కేంద్ర ఎన్నికల సంఘం.. అక్టోబర్ 29న మధ్యాహ్నం 3 గంటల్లోగా తమ ఎదుట వివరణ ఇవ్వాల్సిందిగా జగదీశ్ రెడ్డిని ఆదేశించింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించే బాధ్యతను నెత్తినెత్తుకున్న జగదీశ్వర్ రెడ్డి.. గత కొన్ని రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ తరపున మునుగోడు ఉప ఎన్నికకే ఇంచార్జుగా వ్యవహరిస్తున్న గుంటకండ్ల జగదీశ్ రెడ్డికి ఇప్పుడిలా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడం ఒకింత ప్రతికూల అంశంగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి తప్పు చేశారు కనుకే ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసిందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి.