డియర్ జిందగీ : పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ తప్పు విద్యార్థిదా..?

వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహిద్దాం.. వారిని విజయాల వైపు నడిపిద్దాం

Last Updated : May 31, 2018, 12:25 PM IST
డియర్ జిందగీ : పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ తప్పు విద్యార్థిదా..?
దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ
మొబైల్, ఫేస్‌బుక్, పత్రికలు, ఇంటర్నెట్.. ఇలా ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కడ సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్న విద్యార్థిని విద్యార్థుల గురించే మోత మోగిపోతోంది. టాప్ ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థులను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అభినందనలతో ఆకాశానికెత్తుతున్నారు. అయితే, వాస్తవానికి నేటి పోటీ ప్రపంచంలో అస్తమానం పక్కింటి కుర్రాడితోనో, ఎదురింటి అమ్మాయితోనో తమ పిల్లలను పోల్చుకుంటూ వారిపై భరించలేని ఒత్తిడిని రుద్ది సాధించుకునే ర్యాంకులతో లాభం కన్నా ఎక్కువ నష్టమే జరుగుతుందనే నిజాన్ని గ్రహించాల్సిన అవసరం వుంది. బాగా ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థి ర్యాంకు తెచ్చుకోలేకపోయిన విద్యార్థికన్నా గొప్పోడు అని అనడానికి తగిన ప్రామాణికం ఏంటి ? మార్కులు తక్కువ వచ్చాయి కదా అని ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థి కన్నా తక్కువ మార్కులు పొందిన విద్యార్థిని తక్కువ అంచనా ఎందుకు వేయాలి ? 
 
చదువులో వెనుకబడితేనేం..? తమ జీవితంలో, తాము ఎంచుకున్న రంగంలో, వృత్తిలో రాణించి, గొప్ప పేరు సాధించినవాళ్లలో చదువులో వెనుకబడిన వారే అధికం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కేవలం భారత్ విషయంలోనే అని కాకుండా ప్రపంచంలో పేరొందిన దేశాలన్నింటిలోనూ అక్కడి చరిత్ర, విజ్ఞానం, పరిశోధన, రాజకీయాలు, కళలు, సినీ రంగాలను తీసుకున్నట్టయితే ఆయా రంగాల్లో పైచేయి సాధించిన వారిలో అధిక భాగం చదువులో వెనుకబడిన వారిదే కానీ మరొకరిది కాదనడంలో అతిశయోక్తి లేదు.
 
పిల్లలు కేవలం చదువుల్లోనే విఫలం అవుతారేమో కానీ జీవితంలో కాదు అని చెప్పడానికి నోబెల్ పురస్కారగ్రహీతల జాబితానే మరో చక్కటి ఉదాహరణ. సమస్య అంతా పాఠశాలల్లో బోధన, పరీక్షలు నిర్వహించే విధానంలోనే వుంది కానీ అక్కడ పరీక్షల్లో విఫలం అయ్యే విద్యార్థుల్లో కాదు. అందుకే ఈ వ్యాసం పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థుల కోసం కానే కాదు.. ఆత్మన్యూనతా భావంతో బాధపడుతూ సరైన ప్రోత్సాహం అందని చిన్నారుల కోసమే ఈ వ్యాసం. ఎందుకంటే సమాజం ఎప్పుడూ టాప్ ర్యాంకర్స్‌కే పట్టం కడుతోంది కానీ ఆత్మవిశ్వాసం కొరవడిన వారికి చేయూతనిచ్చి, వారిలోని ప్రతిభను మేల్కొలుపుదాం అని ప్రయత్నించదు కనుక. 
 
ఇదే విషయం గురించి నాతోటి పాత్రికేయుడు పీయుష్ బబెలె ఎంత చక్కగా రాశారంటే.. "CBSE 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. ఎంతోమంది విద్యార్థులు టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. అలాగే ఇంకెంతో మంది తాము ఆశించినదానికన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్నారు. అయితే, ఎవరైతే తక్కువ మార్కులు తెచ్చుకున్నారో.. నా ఆశలన్నీ వాళ్లపైనే వున్నాయి. ఎందుకంటే గత 70 ఏళ్లుగా టాప్ ర్యాంకర్స్ దేశానికి ఏం చేశారంటే అందుకు సమాధానం ఎవరికీ, ఏమీ తెలియదు. అవును, టాప్ ర్యాంకర్స్ తమ జీవితం కోసం తాము ఎంతో చేశారు. అది నాకే బాగా తెలుసు. అందుకే ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో... వారికే నా అభినందనలు. దేశం, సమాజం రెండూ కూడా వారి నుంచే ఎక్కువ ఆశిస్తున్నాయి" అని రాసుకొచ్చారు.
 
అందుకే గాయపరిచే మాటలను పసిమనసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీవితం అనే రేస్ చాలా క్రూరమైనది. ప్రాణాలు తీసేంత పోటీపూరిత వాతావరణంలో చిన్నారులకు మానసిక వికాసం ఎలా సాధ్యమనేది ఆలోచించాల్సిన విషయం. 10వ తరగతి ఫలితాలో లేక 12వ తరగతి ఫలితాలో ఏవీ కూడా విజయానికి మైలు రాళ్లు కానే కావు.. కాబోవు కూడా. కానీ దురదృష్టవశాత్తుగా ఇంకా పాత కాలపు పద్ధతులనే పాటిస్తూ వుండటం వల్లే విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే కొత్త పద్ధతులు ఏవీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. అందుకే ప్రభుత్వం, పాఠశాల, సమాజం వంటివన్నీ పాచిపోయిన తమ పాత పద్ధతులను ఇంకా పాతరేయలేకపోతున్నాయి. 
 
చిన్నారులకు ఏడేళ్ల వయస్సు వస్తే కానీ బడిలో చేర్పించే నియమాన్ని కఠినంగా అమలు చేస్తోన్న పేరొందిన దేశాల వైపు మనం దృష్టిసారించడం లేదు. విద్యార్థుల అభిరుచి, ఆసక్తి ఏంటని తెలుసుకుని వారికి అవసరమైన విద్యను మాత్రమే అందిస్తున్న అమెరికా కాలేజీల గురించి మనం అస్సలే పట్టించుకోం. అక్కడే విద్యార్థి జీవితం విఫలం అవుతోంది. అందుకే ప్రాధాన్యత లేని విషయాల గురించి పట్టించుకోవడం మానేసి నీకు ఏ అంశంపై ఆసక్తి వుందో తెలుసుకునేందుకు ప్రయత్నించు. దానిపైనే నీ విలువైన సమయాన్ని కేటాయించు. 
 
బ్రిటీషోళ్ల కాలం పోయి ఎంతో కాలమైంది. తరాలు మారాయి. కానీ పాఠశాల మాత్రం అక్కడే ఉండిపోయింది. శాంతినికేతన్‌లో విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించి పాతకాలపు విద్యాబోధన పద్ధతులకు స్వస్తి పలికిన నోబెల్ అవార్డుగ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ అడుగుజాడల్లో నడవలేని మన విద్యావ్యవస్థ ఇంకా బ్రిటీషోళ్లు వేసిపోయిన పాతకాలంనాటి రైలు పట్టాలపైనే పరుగెడుతోంది. మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే మోజులోపడిన మనం.. విద్యా విధానం గురించి గాంధీజీ, బుద్ధుడు, ఐన్‌స్టీన్ చెప్పిన విలువైన మాటల్ని అస్సలు ఏ మాత్రం పట్టించుకోలేదు. 
 
పర్యావరణాన్ని కాపాడాలంటే కేవలం పూలకుండీల్లో మొక్కలు పెంచితే సరిపోదు... దట్టమైన అడవులను పెంచాలి. అలాగే దేశం కొత్త పుంతలు తొక్కాలంటే అది కేవలం మేధావులో, లేక శాస్త్రవేత్తలైన పెద్దోళ్ల వల్లో సాధ్యపడదు.. నేటి బాలలే రేపటి పౌరులు అన్నచందంగా నేటి బాలలే రేపటి భవిష్యత్ నిర్మాతలు. అందుకే చిన్నారులను వారి మార్కుల పట్టిక ఆధారంగా అంచనా వేయడం మానేయండి! లేదంటే అంతకన్నా పెద్ద అపరాధం మరొకటి లేదు. అందుకే పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయనే ఒత్తిడిలో ఆత్మహత్యకు పాల్పడే చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చండి. పాఠశాల అనేది కేవలం ప్రపంచాన్ని పరిచయం చేసే రహదారి మాత్రమే కానీ అదే ప్రపంచం కాదు. " చిన్నారుల వైఫల్యానికి కారణం వాళ్లు కాదు... పాతకాలంనాటి బోధనా పద్ధతులే " అని గ్రహించండి.. అదే విషయాన్ని నలుగురికి అర్థమయ్యేలా తెలియచెప్పండి. చిన్నారులు వాళ్ల గమ్యాన్ని వాళ్లు చేరుకోగలరు. మనం చేయాల్సిందల్లా వారికి సరైన రీతిలో ప్రోత్సాహం అందించి దిశానిర్దేశం చేయడమే. ఆ బాధ్యత చిన్నారులది కాదు.. పెద్దలదే. 
 
రచయిత : దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ (ఆత్మహత్య, మానసిక ఒత్తిడికి వ్యతిరేకంగా డియర్ జిందగీ పేరుతో భారత్‌లో తొలి వెబ్ సిరీస్ రచనలు ప్రారంభించిన సీనియర్ పాత్రికేయులు)   
( తాజా కథనంపై మీ విలువైన సూచనలు సలహాలు ఇవ్వగలరు:  https://www.facebook.com/dayashankar.mishra.54https://twitter.com/dayashankarmi )

Trending News