నటకిరిటీ రాజేంద్రప్రసాద్‌కు గణపతి సచ్చిదానంద స్వామి పుట్టినరోజు సందర్భంగా మైసూరు దత్త పీఠంలో "కళానిధి" పురస్కారాన్ని అందజేశారు. వైవిధ్యమైన పాత్రలతో, తనదైన హాస్యంతో తెలుగు ప్రేక్షకులను నాలుగు దశాబ్దాలుగా అలరించినందుకు రాజేంద్రప్రసాద్‌కు ఈ అవార్డు ఇస్తున్నట్లు పీఠం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ తనకు హాస్యమంటే చాలా ఇష్టమని.. ఆ హాస్యానికే కిరీటం పెట్టిన హాస్యనటుడు రాజేంద్రుడికి అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు.
సచ్చిదానంద స్వామి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం పలువురికి పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. మైసూరులోని చాముండీ హిల్స్ ప్రాంతంలోని 40 ఎకరాల సైటులో దత్తపీఠం వేద అధ్యయనానికి, యోగా శిక్షణకు శ్రీకారం చుట్టింది. ఈ దత్త పీఠంలోనే దత్తాత్రేయ ఆలయం, వెంకటేశ్వర క్షేత్రం, నాద మండపం, వేద పాఠశాల, ఆయుర్వేద ఆసుపత్రి, ధర్మ ధ్వజం, బోన్సాయ్ గార్డెన్, మ్యూజియం మొదలైనవి ఉన్నాయి. ఈ దత్తపీఠాన్నే అవధూత దత్త పీఠం అని కూడా అంటూ ఉంటారు.