Munugode Bypoll: నల్గొండ జిల్లా మునుగోడు ప్రజలు దసరా పండుగను అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఉప ఎన్నిక రానుండటం ప్రజలకు వరంగా మారనుంది. ఆగస్టు తొలి వారంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈసీ రూల్స్ ప్రకారం బైపోల్ జరపడానికి ఫిబ్రవరి మొదటి వారం వరకు గడువుంది. దీంతో ఉప ఎన్నికను ముందే పెడతారా లేద జనవరిలో నిర్వహిస్తారా అన్నదానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో పెడతారా లేక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో ఉంటుందా అన్నదానిపై క్లారిటీ రాలేదు. అయితే తాజాగా మునుగోడు ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సిగ్నల్స్ వచ్చాయంటున్నారు.
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించాలని సీఈసీ దాదాపు నిర్ణయంచిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా మొదలైందని చెబుతున్నారు. హర్యానాలో ఖాళీగా ఉన్న ఒక సీటుతో పాటు మునుగోడు ఉప ఎన్నిక జరపాలని ఈసీ ముందు భావించినా.. ఇప్పుడు మాత్రం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరపనుందని సమాచారం. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2017 నవంబరు 9న జరిగాయి. పూర్తయ్యాయి. అసెంబ్లీ పదవీకాలం జనవరి 8 వరకు ఉంది. అయితే హిమాచల్ ప్రదేశ్ వాతావరణ పరిస్థితులు, మంచు తీవ్రత దృష్ట్యా నవంబర్ రెండో వారంలో పోలింగ్ జరిపేలా సీఈసీ ఏర్పాట్లు చేస్తుందని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ బృందం గత వారం హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించి ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించింది.
అటు గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ రెండో వారం వరకు గడువున్నా... అక్కడ కూడా నవంబర్ లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఈసీ భావిస్తుందని సమాచారం. ఇటీవలే గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు పాటిల్ నవంబర్ చివరలో ఎన్నికలు వస్తాయంటూ పార్టీ కేడర్ ను అప్రమత్తం చేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ లో జరగడం ఖాయంగా కనిపిస్తోంది. నవంబర్ లో పోలింగ్ అంటే అక్టోబర్ మొదటి వారంలోనే షెడ్యూల్ వస్తుంది. ఈ లెక్కన దసరాకు అటు ఇటుగా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రాబోతుందన్నది ఢిల్లీ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు సీఈసీ నుంచి సమాచారం వచ్చిందని అంటున్నారు. బీజేపీ హైకమాండ్ నుంచి రాష్ట్ర నేతలకు దీనిపై సిగ్నల్స్ వచ్చాయంటున్నారు.
మునుగోడులో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఓ రేంజ్ లో సాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా బీజేపీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పీడ్ పెంచారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా మంత్రి జగదీశ్ రెడ్డి ఆత్మీయ సమావేశాలతో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లతో కలిసి మంత్రి సభలు, సమావేశాలు జరుపుతుండటంతో టికెట్ దాదాపుగా ఆయనకేనని తెలుస్తోంది. దసరా, దీపావళికి ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో మునుగోడు ప్రజలకు పండుగ రెట్టింపు కానుంది. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ధావత్ లు ఏర్పాటు చేస్తున్నాయి పార్టీలు. మందు, ముక్కతో ఓటర్లను ముంచేస్తున్నాయి.
ఇక దసరా పండుగ కోసం అన్నిపార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేసున్నాయని తెలుస్తోంది. ప్రతి ఇంటికి ఏదో ఒక కానుక ఇచ్చేలా అభ్యర్థులు భారీగా డబ్బులు ఖర్చు చేయనున్నారని అంటున్నారు. దసరా పండుగకు ప్రతి ఇంటికి మటన్, మందు సరఫరా చేసేలా అధికార పార్టీ ఏర్పాట్లు చేసుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే లిక్కర్ ను డంప్ చేసిందని అంటున్నారు. అధికార పార్టీకి ధీటుగా బీజేపీ, కాంగ్రెస్ కూడా దసరా రోజున ఓటర్లకు తాయిలాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం. దసరా పండుగ రోజున మద్యం, మాంసం సరఫరాతో పాటు దీపావళికి యువతకు బాణసంచా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాయట. మొత్తంగా దసరా రోజుల్లో ఉప ఎన్నిక రావడంతో మునుగోడు ప్రజలు పండుగ చేసుకోనున్నారని అంటున్నారు. అటు రాష్ట్ర చరిత్రలోనే మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైనదిగా చరిత్ర సృష్టించనున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read : నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి.. బోరున ఏడ్చేసిన మహేశ్ బాబు కుమార్తె సితార!
Also Read : TRS MLA: ఈడీ కేసులో రెండవ రోజు విచారణ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ తప్పదా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి