Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Review: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తన దైన ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఎస్ఆర్ కళ్యాణమండపం, సెబాష్టియన్, సమ్మతమే వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తగినట్లుగా సినిమా ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేయడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది అనేది సినిమా రివ్యూలోకి వెళ్లి చూద్దాం
నేను మీకు బాగా కావాల్సిన వాడిని కథ:
వివేక్(కిరణ్ అబ్బవరం) ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు తన క్యాబ్‌లో ఎక్కిన తేజు( సంజన ఆనంద్) బాగా తాగేసి ఉండడంతో ఒక అమ్మాయి అంతలా ఎందుకు తాగింది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే తేజు తన లవ్ స్టోరీ చెప్పి షాక్ ఇస్తుంది. తన అక్క వల్ల తాను ఒకరి చేతిలో మోసపోయాను అనే విషయాన్ని చెప్పడంతో వివేక్ షాక్ అవుతాడు. తర్వాత వివేక్ ప్రోత్సాహంతో దూరమైన తన కుటుంబానికి తేజు దగ్గరవుతుంది. వివేక్ మీద పెరిగిన ఇష్టాన్ని బయటపెట్టాలి అనుకునే సమయానికి వివేక్ అనూహ్యంగా తేజుకు మరో షాకిస్తాడు. అసలు నవీన్ వివేక్ గా ఎందుకు మారాడు? తేజు కోసం క్యాబ్ డ్రైవర్ అవతారం ఎందుకు ఎత్తాడు? చివరికి వివేక్ తేజు ఒకటవుతారా అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ:
ఇది కొత్త కథ కాదు పాత కథనే కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నామని సినిమా ప్రమోషన్లో కిరణ్ అబ్బవరం వెల్లడించారు. అదేవిధంగా సినిమా ఆద్యంతం సాగుతుంది. మందుకు బానిసైన ఒక అమ్మాయిని ఆమె బాధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఆమె బాధకు కారణం తెలిసి దాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాడు వివేక్. అలా ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా పాత్రల పరిచయానికే సమయం తీసుకున్నాడు దర్శకుడు. అయితే ఫస్ట్ అఫ్ పూర్తయ్యే సమయానికి కూడా సినిమా పూర్తి క్లారిటీ అయితే రాదు. తల్లిదండ్రుల నుంచి దూరమైన తేజు ప్రేమలో మోసపోయాను అనే బాధతో తల్లిదండ్రులకు దూరమయ్యానని బాధతో తాగుతూ ఉండడం దానికి వివేక్ ఒక పరిష్కారం చూపడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లోకి వచ్చాక సినిమాలో ఆసక్తికరమైన ట్విస్టు చోటు చేసుకుంటుంది. ఎవరు ఊహించని విధంగా ఆమె లవ్ స్టోరీ ని డిజైన్ చేసిన దర్శకుడు అదే విధంగా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులకు షాకిస్తారు. అయితే సినిమా లైన్ పరంగా చాలా బాగానే ఉన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో కొంతమేర తడబడినట్లు కనిపిస్తోంది. బహుశా ఇద్దరు దర్శకుల ప్రోడక్ట్ కావడంతో కొంతమేర ఇబ్బంది పడినట్లు అనిపించింది. సినిమాలో కొన్ని లాజిక్స్ మన బుర్రకి అంత ఈజీగా అర్థం కావు.
నటీనటుల విషయానికి వస్తే:
నటీనటుల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కాస్త నటన విషయంలో మెరుగయ్యాడు. హీరోయిన్ సంజన ఆనంద్ కూడా చాలా బరువైన పాత్రలో చాలా ఈజ్ తో చేసినట్లు అనిపిస్తుంది. ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్ వంటి వారు సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. సమీర్, అప్పాజీ అంబరీష ఇలా ఎవరికి వారు తమ పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు. రెండో హీరోయిన్ నిడివి చాలా తక్కువ అయినా తన పరిధి మేర నటించి ఆకట్టుకుంది.
టెక్నికల్ టీం:
టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయింది. అలాగే సంగీతం కూడా బాగా కుదిరింది. నేపథ్య సంగీతం సినిమాకు మరో లెవెల్ కి తీసుకు వెళ్లిందని చెప్పక తప్పదు. ఎడిటింగ్ విషయంలో కూడా ఎక్కడా వంక పెట్టడానికి వీలు లేకుండా చూసుకుంది సినిమా యూనిట్. మొదటి ప్రాజెక్టు అయినా కోడి దివ్య దీప్తి ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా కుదిరాయి. ఒక చిన్న సినిమా అనే ఫీలింగ్ ఎక్కడా కలగకుండా రిచ్ లుక్ తో సినిమా ఆద్యంతం నడిపించారు.
ఓవరాల్ గా:
ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. లాజిక్స్ వెతక్కుండా చూస్తే వీకెండ్ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయగలిగే మూవీ ఇది.
Rating: 2.75/5
Also Read: Prabhas First in ORMAX List: అది కదా క్రేజ్ అంటే.. సినిమాలతో సంబంధమే లేకుండా!
Also Read: Aa Ammayi Gurinchi Meeku Cheppali Review: సుధీర్ బాబు-కృతి శెట్టిల సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి