Etela Critises KCR National Politics: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ ప్రతిపక్ష నేతల నుంచి ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత రాష్ట్రంలో సమస్యలనే పరిష్కరించలేని కేసీఆర్.. దేశాన్ని ఏం బాగుచేస్తాడంటూ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తాడా అంటూ ఎద్దేవా చేశారు. చౌటుప్పల్‌లో శనివారం (సెప్టెంబర్ 10) మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కేసీఆర్ చెల్లని రూపాయిగా మిగిలిపోయారని.. ఇక జాతీయ రాజకీయాల్లో ఏం చెల్లుతారని ప్రశ్నించారు. కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలే విశ్వాసం కోల్పోయారని.. ఇక దేశ ప్రజల్లో ఆయన నమ్మకాన్ని ఎలా కూడగట్టగలరని అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. గురుకుల పాఠశాలల్లో పురుగుల అన్నం తిని విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోవట్లేదని అన్నారు.
తెలంగాణ అమరవీరులకు ఇచ్చిన హామీలను సైతం కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి అవినీతికి కేరాఫ్‌గా మార్చి.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని ఆరోపించారు. గ్రామాల్లో సర్పంచ్‌లకు బిల్లులు రావాలంటే టీఆర్ఎస్లో చేరాలని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలు చేసే సత్తా లేదని అన్నారు.ఇక మునుగోడు ఉపఎన్నిక గురించి ప్రస్తావిస్తూ హుజురాబాద్ తీర్పే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందన్నారు. ఉపఎన్నిక ఉంటేనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు అడుగుపెడుతాడని విమర్శించారు.
కాగా, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వేగంగా అడుగులేస్తున్నారు. కొద్దిరోజులుగా బహిరంగ సభల్లో, పార్టీ సమావేశాల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎట్టకేలకు కొత్త పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే దసరా పండగ రోజే ఆయన కొత్త పార్టీపై ప్రకటన చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read: Brahmastram review: బ్రహ్మాస్త్రం మూవీ ఎలా ఉందంటే?
Also Read: సీతారామం సినిమాలో తొమ్మిది మంది డైరెక్టర్లు... వారిని అబ్జర్వ్ చేశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook