సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ భారతదేశంలోనే అతిపెద్ద జెండాని ఈ రోజు ఎన్టీఆర్ స్టేడియంలో ఆవిష్కరించారు. 122X183 అడుగుల వెడల్పు ఉన్న ఈ జెండాని ఆయన 1857 మే 10 తేదిన జరిగిన తొట్టతొలి స్వాతంత్ర సంగ్రామాన్ని స్మరిస్తూ ఆవిష్కరించినట్లు జనసేన పార్టీ ట్విటర్ ద్వారా తెలిపింది.
ఈ జెండా ఆవిష్కరణ మహోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘దేశంలోనే అతి పొడవైన జాతీయ జెండాను ఆవిష్కరించడానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. ఈ జెండాలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు..అలాగే అశోక చక్ర చిహ్నం మన జాతి సమగ్రతకి, సమైక్యతకు గుర్తు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్లు ఈ మువ్వన్నెల జెండా ఏ కులానిదో, పార్టీదో కాదు. ప్రతి ఒక్కరిదీ.’ అని తెలిపారు.
ఈ జెండా ఆవిష్కరణ సభలోనే ఆయన పార్టీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు .‘భారతీయుడినైన నేను.. భారతదేశ పౌరుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నాను. నా దేశ వారసత్వ సంపదను పరిరక్షించి.. ప్రకృతికి నష్టం కలిగించకుండా పర్యావరణాన్ని కాపాడుతానని.. నిత్యం దేశ ప్రజల ఉన్నతికై తపిస్తూ.. వారి ప్రయోజనాలే ప్రథమ చట్టాలుగా భావిస్తూ.. ఎలాంటి కుల,మత, ప్రాంత, వర్గ భేదాలకు తావునివ్వకుండా.. దేశ ప్రయోజనాలే పరమావిధిగా పాటిస్తానని మన జెండా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అన్నారు.