కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఎన్నికలలో పోటీ చేయడానికి బీఫాం కూడా ఇచ్చిన తరువాత ఆ పార్టీ సీనియర్ నేత, నటుడు అంబరీష్ తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వయోభారం, అనారోగ్యం కారణంగా ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనను అని స్పష్టం చేశారు అంబరీష్. ఎన్నికలలో పోటీకి కూడా నిరాకరించారు. కాంగ్రెస్ పార్టీ అంబరీష్కు మాండ్యా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఖరారు చేసినప్పటికీ బీఫాం తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. దాంతో చివరి నిముషంలో కాంగ్రెస్ మరో అభ్యర్థికి బీఫాం ఇచ్చి రంగంలోకి దింపింది.
తనకు మంత్రి పదవి ఇవ్వని పక్షంలో.. తన భార్య సుమలతకు టికెట్ ఇవ్వాలని కోరినట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు పార్టీ అధిష్టానం, సిద్ధరామయ్య అంగీకరించలేదని తెలిసింది. కాగాఅంబరీష్ను బుజ్జగించేందుకు పార్టీ దూతలు చివరి వరకూ ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
ముగిసిన నామినేష్లను గడువు
కర్ణాటక శాసనసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. వచ్చే నెల 12న పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 15వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య చాముండేశ్వరి నియోజక వర్గంనుంచే కాకుండా బాదామి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. బాదామి స్థానం నుంచి బీజేపీ తరఫున శ్రీరాములు బరిలో ఉన్నారు. దీంతో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితుడైన బీ శ్రీరాములు సిద్దరామయ్యకు ఇక్కడ గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.