తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం పర్యటించిన సీఎం చంద్రబాబు కేంద్రంపై, గవర్నర్ వ్యవస్థపై, పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ద్వారపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజలంతా బాగుండాలనే బీజేపీతో కలిశానని, ఇప్పుడు కేంద్రమే తమను చిన్నచూపు చూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి పరిస్థితైనా రావచ్చని, అందరూ ఐకమత్యంగా ఉండాలన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో మీ ఆటలు సాగినా ఏపీలో మాత్రం సాగవని బీజేపీని ఉద్దేశిస్తూ అన్నారు. అవినీతిపరులను ప్రధాని తన కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.
మొన్నటి వరకూ కలిసి ఉన్న పవన్ కల్యాణ్ తమపై ఆరోపణలు గుప్పించడం శోచనీయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రం బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఆనాడే పోరాడారన్నారు. కేంద్రానికి ఎన్ని అధికారాలుంటే రాష్ట్రానికి అన్ని అధికారాలు ఉన్నాయన్నారు. కేంద్రం ఆడుతున్న ఆటలకు అడ్డుకట్ట వేయాలంటే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లూ టీడీపీ గెలుచుకుని ప్రధాని పదవిని నిర్ణయించే విధంగా ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నాదే
తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటకుంటలు తవ్వామన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తున్నామని, నదుల అనుసంధానంతో ముందుకెళ్తున్నామన్నారు. ఎల్ఈడీ దీపాల ఏర్పాటులో తూర్పుగోదావరి జిల్లా నూరు శాతం అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ప్రకటించారు. అనంతరం చంద్రకాంతి పథకాన్ని ప్రారంభించారు. అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 27 లక్షల ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పశువుల పేడను సేకరించి దానిని ఎరువుగా మార్చి మళ్లీ రైతులకే ఇస్తామని అన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను తీసుకెళ్లేందుకు ఒక్కో వ్యక్తిని ఏర్పాటు చేస్తామని అన్నారు.