దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కుంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్కి వారం రోజులపాటు పోలీసు కస్టడీ విధిస్తూ లక్నో కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఉన్నావ్ రేప్ కేసులో కుల్దీప్ సింగ్ సెంగర్ని శుక్రవారం 17 గంటలపాటు ప్రశ్నించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన సీబీఐ.. శనివారం ఉదయం అతడిని లక్నో కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఉన్నావ్ గ్యాంగ్ రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యే కుల్దీప్ని అరెస్ట్ చేయాల్సిందిగా అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
"2017లో జూన్ 4న ఉపాధి ఇప్పించాల్సిందిగా కోరుతూ మైనర్ని అయిన తాను, తన బంధువుతో కలిసి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లగా.. అక్కడ ఎమ్మెల్యే కుల్దీప్ సహా పలువురు వ్యక్తులు, పలుమార్లు తనపై సామూహిక అత్యాచారం జరిపారు" అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఎన్నిసార్లు పోలీసులకు మొరపెట్టుకున్నప్పటికీ, పోలీసులు మాత్రం ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు. దీంతో పోలీసుల తీరుపై విసుగుచెందిన బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు ఇక తమకు న్యాయం జరగదు అనే అభద్రతాభావంతో గత వారం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ఎదుట తమని తాము నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బాధితురాలి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆ మరుసటి రోజే అతడు లాకప్ డెత్కి గురయ్యాడు. పైగా బాధితురాలి తండ్రిని హింసించిన కారణంగానే అతడు మృతి చెందాడని, అందుకు అతడి శరీరంపై గాయాలే ఆధారం అని పోస్టుమార్టం నివేదిక స్పష్టంచేసింది. దీంతో ఈ ఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా పరిగణించడం, ప్రజా సంఘాలు రోడ్డెక్కడంతో కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అనంతరం ఉన్నావ్ రేప్ కేసులో చివరకు అలహాబాద్ హై కోర్టు ఆదేశాలతో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.