కర్ణాటకలో ఎన్నికల పోరు మరింత రసవత్తరమవుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి మధ్య ఈ పోరు ఆసక్తికరమైన పరిణామాలకు తెరతీస్తోంది. వరుణ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తనయుడు బీవై విజయేంద్ర పోటీ చేయాలనుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు డా. యతీంద్ర కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు రంగంలోకి దిగుతున్నాడు. వాస్తవానికి వరుణ స్థానం నుంచి బీజేపీ బీవై విజయేంద్ర పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ అంతకన్నా ముందే కాంగ్రెస్ మాత్రం అక్కడి నుంచి డా. యతీంద్రను బరిలో దింపేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర ప్రస్తుతం డాక్టర్‌గా ప్రాక్టీసింగ్ చేస్తున్నారు. 2013 ఎన్నికల వరకు రాజకీయాలతో ఏ సంబంధం లేని వ్యక్తి యతీంద్ర. ప్రస్తుతం కూడా క్రియాశీల రాజకీయాల్లో యతీంద్రది చురుకైన పాత్ర కాదు. ఇక బీఎస్ యడ్యూరప్ప తనయుడు బీవై విజయేంద్ర విషయానికొస్తే, ఈ ఎన్నికల్లో విజయేంద్ర పోటీ ఖాయమైతై, ఇదే అతడికి రాజకీయరంగ ప్రవేశంలో తొలి అడుగు అవుతుంది. విజయేంద్ర అభ్యర్థిత్వంపై మీడియా డా.యతీంద్రను ప్రశ్నించగా.. " ప్రజాస్వామ్యంలో ఎవరికైనా, ఎవరినైనా ఎన్నుకునే స్వేచ్ఛ వుంది కనుక తన ప్రత్యర్థికి 'ఆల్ ది బెస్ట్' అని శుభాకాంక్షలు చెప్పడం తప్ప ఇంకేమీ చెప్పదల్చుకోలేదు" అని అభిప్రాయపడ్డారు.
ఏదేమైనా, ఇప్పటివరకు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి మధ్య పోటీగా వున్న కర్ణాటక ఎన్నికలు.. వరుణ అసెంబ్లీ సీటు సాక్షిగా వీరి వారసులు పోటికి దిగడానికి సిద్ధపడుతుండటంతో ఆ పోరు కాస్త మరింత రసవత్తరంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు.