Venkatesh about f3 movie : ఎఫ్2 పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాని, అందులో పాత్రలని ప్రేక్షకులంతా ఎంతో అభిమానించారు. ఎఫ్ 3 నుండి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వినోదం కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో ఉంటుంది'' అన్నారు హీరో విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఎఫ్3' ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న నేపధ్యంలో హీరో విక్టరీ వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న 'ఎఫ్ 3' విశేషాలివి..
మీ ఇమేజ్, స్టార్ డమ్ అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ సినిమా చేస్తున్న హీరోలా ఎఫ్ 3 చేశారని దర్శకుడు అనిల్ రావిపూడి గారు చెప్పారు.. దీని గురించి చెప్పండి..
ప్రతీ సినిమాని మొదటి సినిమాగానే భావిస్తా. ప్రతీ సినిమాకి అలానే కష్టపడతా. నా స్టార్ డమ్ ఇమేజ్ ని ఎప్పుడూ క్యారీ చేయను. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్లు చేసినప్పుడు ఇలాంటి ఇమేజిని క్యారీ చేయకూడదు. అప్పుడే నేచురల్ ఫ్లో బయటికొస్తుంది. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, అబ్బాయిగారు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి.. ఇలా ఎన్నో చిత్రాలు ఎలాంటి ఇమేజ్ లెక్కలు వేయకుండా చేసినవే. సినిమా చేసినప్పుడు ఎక్కువ అలోచించను. సినిమాని, నా పాత్రని ఎంజాయ్ చేస్తాను. బహుశా అనిల్ రావిపూడికి కూడా ఇదే అనిపించుంటుంది. ఎఫ్3 అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది.
నారప్ప, దృశ్యం తర్వాత ఎఫ్ 3 లాంటి ఎంటర్ టైనర్ చేయడం ఎలా అనిపించింది ?
నారప్ప, దృశ్యం రెండూ సీరియస్ సినిమాలు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఎఫ్ 3తో మళ్ళీ థియేటర్ ఆడియన్స్ ని కలవడం ఆనందంగా ఉంది. కామెడీ అనగానే ఒక ప్రత్యకమైన ఎనర్జీ వచ్చేస్తుంది. కాలేజీ రోజుల్లో ఉన్నట్లే అనిపిస్తుంది. నేను సహజంగానే అందరితోనూ సరదాగా ఉంటా. నన్న ఇలా చూడటానికి ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు. రెండేళ్ళ గ్యాప్ తర్వాత ఎఫ్ 3లాంటి బిగ్ ఎంటర్ టైనర్ తో రావడం ఆనందంగా వుంది. ఫ్యామిలీ తో కలసి ఇలాంటి ఎంటర్ టైనర్లు చూడటంలో ఓ కిక్ వుంటుంది. ఎఫ్ 2పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాని, పాత్రలని ప్రేక్షకులంతా అభిమానించారు. ఎఫ్ 3 నుండి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వినోదం కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో ఉంటుంది.
ఎఫ్ 2కంటే ఎఫ్ 3లో చాలా హుషారుగా కనిపిస్తున్నారు ? సీక్రెట్ ఏమిటి ?
ఏదైనా స్క్రిప్ట్ ప్రకారమే వుంటుంది. ఇచ్చిన స్క్రిప్ట్ కి డబుల్ డోస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అయితే ఏదీ ప్లాన్ చేసుకోను. స్పాంటేనియస్ గా వస్తుంటాయి. కొన్నిసార్లు నేను చేసింది మర్చిపోతాను. దర్శకుడు అనిల్ మళ్ళీ గుర్తు చేసి అది బావుంది మళ్ళీ చేయండని అడుగుతారు. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి..ఇలా ఏ సినిమా తీసుకున్నా.. పెద్ద ప్లాన్ చేయడం అంటూ ఏమీ వుండదు. స్పాంటేనియస్ గానే ఉంటుంది.
ఎఫ్ 3 డబ్బు చుట్టూ తిరిగే కథ. అలాంటి కథలో చేయడం ఎలా అనిపించింది ?
త్వరగా డబ్బులు సంపాదించడం, పెద్ద కలలు కనడం, అవకాశాలు సృష్టించడం మానవుని సహజ లక్షణం. అందరికీ ఆశ ఉంటుంది. ఈ క్రమంలో బోలెడు సమస్యలు ఎదురౌతాయి. బోలెడు పాఠాలు నేర్చుకుంటాం. ఆ పాఠాలతో మారుతాం. ఒకవేళ మారకపోతే .. మళ్ళీ అవే సమస్యల చట్టూ తిరగాల్సి ఉంటుంది.
చాలా మంది దర్శకులతో పని చేశారు కదా.. దర్శకుడు అనిల్ రావిపూడి తో పని చేయడం ఎలా అనిపించింది ?
అనిల్ రావిపూడి చాలా సింపుల్ పర్శన్. నటీనటుల నుండి ది బెస్ట్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. చాలా అద్భుతంగా రాస్తారు. ఆయన డైలాగ్స్ చాలా నేచురల్‌గా ఉంటాయి. దీంతో నటన కూడా సహజంగా అనిపిస్తుంది. అనిల్ చాలా ఎనర్జిటిక్. మేము ఇద్దరం క్రేజీగా ఉంటాం. మసాలా సినిమా నుండే అనిల్ నాకు తెలుసు. అనిల్ లో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంది. ఆయనకి ఏం కావాలో క్లారిటీ ఉంది.
ఎఫ్ 3పాత్ర మీ రియల్ లైఫ్ కి ఎంత దగ్గరగా ఉంటుంది.?
పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది (నవ్వుతూ).
మీ కామెడీకి గైడ్ ఎవరైనా ఉన్నారా ?
నాకు చిన్నప్పటి నుండి అబ్జర్వేషన్ ఉంది. ప్రతిది బాగా అబ్జర్వ్ చేస్తాను. ప్రయాణాలు చేసినప్పుడు, నలుగురితో కలిసినప్పుడు... వారి ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంజ్వేజ్ ని గమనిస్తుంటాను. ఇక బోలెడు మంది గొప్ప కమెడియన్లు ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటాం.
డైలాగ్స్ లో కూడా స్పాంటీనిటీని యాడ్ చేసి స్పాట్ లో ఇంప్రవైజ్ చేస్తారా ?
ప్రతి డైలాగ్ ని ఇంప్రవైజ్ చేయాల్సిందే. కొన్ని సార్లు వాయిస్ లోనే ఒకరకమైన ఫన్ పుడుతుంది. కొందరు మాట్లాడితేనే నవ్వొస్తుంది. అల్లు రామలింగయ్య గారు టిపికల్ వాయిస్ తో నవ్విస్తారు. అలాగే జానీ లీవర్ లాంటి నటులు కూడా తమ వాయిస్ తోనే ఆకట్టుకుంటారు.
వరుణ్ తేజ్ గురించి ఏం చెప్తారు ?
ఎఫ్ 2 లో మా కాంబినేషన్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు. ఎఫ్ 3లో వరుణ్ తేజ్ పాత్ర ఇంకా బావుంటుంది. చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్ తో వండర్ ఫుల్ జర్నీ.
డబ్బుకి మీరిచ్చే ప్రాధాన్యత ఏమిటి ?
డబ్బు అందరికీ కావాలి. దానికి కోసం అందరూ సరైన మార్గంలో కష్టపడాలి. ఈ నేచర్ మనకు కావాల్సింది ఇస్తుంది. లేనిదాని కోసం ఎక్కువ తాపత్రయపడకూడదు. వున్నదాన్ని సక్రమంగా వాడుకోవాలి. ఆనందంగా బ్రతకాలి.
ఎఫ్ 2కి ఎఫ్ 3మధ్య ఎలాంటి తేడా ఉంటుంది.?
ఎఫ్ 3లో మోర్ ఫన్ యాడ్ అయ్యింది. చాలా మంది నటులు యాడ్ అయ్యారు. సినిమా చాలా లావిష్ గా తీశాం. చాలా మంచి సీక్వెన్స్ లు వున్నాయి. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్ 3 లో ఉంది.
ఒకప్పుడు హీరోయిజం సినిమాలు, తర్వాత కంటెంట్ వున్న కథలు వచ్చాయి. ఇప్పుడు ఎక్స్ ట్రీమ్ హీరోయిజం ఉన్న సినిమాలు వస్తున్నాయి. ఈ వేవ్ ని ఎలా చూస్తారు ?
దేన్నీ ఎక్కువగా అలోచించకూడదు. ప్రతి సినిమా ప్రత్యేకమైనదే. ఇక్కడ ఆడియన్స్ ముఖ్యం. అల్టిమేట్ గా ప్రేక్షకులకు కంటెంట్ నచ్చాలి.
నెట్ ఫ్లిక్ష్ లో చేస్తున్న వెబ్ సిరిస్ గురించి ?
ఆ సిరిస్ చాలా వండర్ ఫుల్ గా వుంటుంది. దాని గురించి ఇప్పుడే ఎక్కువగా చెప్పకూడదు. ఐతే కెరీర్ లో మొదటిసారి చాలా భిన్నమైన పాత్రలో కనిపిస్తా.
దిల్ రాజు గారి తో ఇది మూడో సినిమా.. ఆయనతో కలసి పని చేయడం ఎలా అనిపించింది ?
దిల్ రాజు గారు నాకు చాలా కాలం క్రితమే తెలుసు. 'ప్రేమించుకుందాం రా' సమయంలోనే ఆయన సినిమాలో స్పార్క్ గమనించారు. ఆయన సినిమాని చాలా బాగా పరిశీలిస్తారు. సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎంతో కృషి చేస్తే గానీ ఇన్ని విజయాలు రావు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటాను.
ఇది మీకు ఏడో మల్టీ స్టారర్.. మీరు మళ్ళీ మళ్ళీ చేయాలనుకునే కాంబినేషన్ ఏది ?
కథ బావుంటే ఎవరితోనైనా మల్టీ స్టారర్ చేస్తా.
ప్రతి హీరోకి బాక్సాఫీసు లెక్కలతో కిక్ వుంటుంది.. మీకు లెక్కలకు ప్రాధాన్యత ఇస్తారా ?
ప్రతి సినిమా విజయం అవ్వాలానే కోరుకుంటా. బాక్సాఫీసు లెక్కలు సంగతి అటుంచితే నిర్మాతకు మేలు జరగాలని భావిస్తా. నిర్మాతకు అన్ని విధాల సహకరిస్తా. తర్వాత అంతా ప్రేక్షకుల చేతిలో ఉంటుంది.
మీ సినిమా బడ్జెట్, ఫిలిం మేకింగ్ ప్లానింగ్ లో ఇన్వాల్ అవుతారా ?
నేను నిర్మాత పక్షాన ఆలోచిస్తా. సెట్ కి వెళ్ళిన తర్వాత ఏది వృధా జరుగుతున్నా ఒప్పుకోను. ఇక ఫిలిం మేకింగ్ ప్లానింగ్ కి ఒక ఫార్ములా అనేది వుండదు. అంతిమంగా రిజల్ట్ బావుంటే.. మనం పడిన కష్టం అంతా మర్చిపోతాం.
మీకు పాన్ ఇండియా సినిమా చేయాలని ఉందా ?
పాన్ ఇండియా గురించి పెద్దగా అలోచించలేదు. ఐతే సరైన టీం కుదిరితే తప్పకుండా చేస్తా.
ఏదైనా రియాలిటీ షోకి హోస్ట్ చేయాలనీ ఉందా ?
ఇది వరకే చాలా మంది నన్ను సంప్రదించారు. ఐతే రియాలిటీ షో చేయడంలో నాకు చిన్న ఇబ్బంది ఉంది. చెప్పిన డైలాగ్ మళ్ళీ చెప్పి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమంటే రెండు మూడుసార్లు తర్వాత నాకు ఎదో తెలియని బ్లాంక్ వచ్చేస్తుంది.
మీ అబ్బాయిని ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు ?.
చదువుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు.
కోవిడ్ టైంలో షూటింగ్ ఎలా అనిపించింది ?.
చాలా కష్టం అనిపించింది. అవతలి ఆర్టిస్ట్ కి కోవిడ్ ఉందో లేదో తెలీదు. చెప్పరు (నవ్వుతూ) షాట్ అయిన తర్వాత బస్ లో సానిటైజ్ చేసుకోవడం కంపల్సరి. ఐతే దేవుడి దయవల్ల నేను కోవర్జిన్ని(నవ్వుతూ..).. ఇప్పటివరకూ నాకు కరోనా సోకలేదు.
సినిమా చేసినప్పుడే కనిపిస్తారు. మిగాత సమయంలో ఎక్కడా కనిపించరు .. కారణం ?
ఎవరితో కలవకూడదని కాదు. సినిమా తప్ప బయటికి వచ్చి మాట్లాడానికి మరో టాపిక్ ఉండదు కదా. ఫ్యామిలీతో గడపటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. మెడిటేషన్, ధ్యానం చేస్తుంటాను.
మీ నాన్నగారి బయోపిక్ లో నటిస్తారా ?
చేస్తే బాగానే ఉంటుంది. ఐతే స్క్రిప్ట్ కుదరాలి కదా.. వివేకానంద కథ అనుకున్నాను. అది కుదరలేదు.
ఎఫ్ 3లో మీకు పెరిగిన బాధ్యతలు ఏమిటి ?
ఎఫ్ 2కు మించిన వినోదం ప్రేక్షకులు ఆశిస్తారు. అది అందించడమే పెద్ద బాధ్యత. ఐతే ఆ భాద్యతని విజయవంతంగా నిర్వర్తించాం. ఎఫ్ 3 హిలేరియస్‌గా ఉంటుంది.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ?
దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి డ్యాన్స్ నెంబర్స్ ఉన్నాయి. అలాగే శ్రీరామ్ డీవోపీ కూడా వండర్ ఫుల్‌గా వుంది. ఎఫ్ 3లో నటీనటులు, టెక్నిషియన్లు అందరూ అద్భుతంగా చేశారు.
ఎఫ్ 3లో మీకు ఎవరితో కాంబినేషన్ వుంటుంది ? వెంకీ ఆసనంలా కొత్త ఆసనం ఏదైనా ఉందా ?
ఇందులో అందరితోనూ నాకు కాంబినేషన్ ఉంటుంది. ఎఫ్ 2లో వెంకీ ఆసన్ చాలా పాపులర్ అయ్యింది. పిల్లలు కూడా దాన్ని చేయడం చూసి నేనే సర్ ప్రైజ్ అయ్యా. ఇలాంటి సినిమాలు వాళ్లకి నచ్చుతున్నాయనే ఆనందం ఉంది.
రియల్ లైఫ్‌లో ఫస్ట్రేషన్ ఉంటుందా?
ఉండదు. కానీ నేను టైంని బాగా ఫాలో అవుతాను. ఈ విషయంలో ఎవరైనా ఇబ్బంది పెడితే కొంచెం చిరాకు వస్తుంది (నవ్వుతూ).
సినిమా ఇండస్ట్రీలో పోటీ, పోలికలు కామన్.. కానీ ఈ రెండిటికీ దూరం అని చెబుతున్నారు.. ఎలా సాధ్యం ?
నేను ఒకరితో పోల్చుకొను. నాకు ఉన్నదే బోనస్ అనుకుంటా. ఇంకేది ఎక్కువగా అడగను. ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తా. సినిమాల్లోనే కాదు ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు ప్రత్యేకం. ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు.
కొత్త సినిమాల గురించి ?
సితార, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ లో చేస్తున్నాను.