Jupally Krishna Rao meets Tummala, Ponguleti in Khammam: మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లా పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్మం పర్యటనలో ఆయన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మరో టీఆర్ఎస్ నేత పిడమర్తి రవితో భేటీ అయ్యారు. ఓవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్న వేళ.. జూపల్లి సీఎం టూర్‌కు డుమ్మా కొట్టి మరీ ఖమ్మంలో పర్యటించడం... అందులోనూ అసంతృప్తి నేతలతో ఆయన భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది.
మొదట దమ్మపేటలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లిన జూపల్లి.. తుమ్మలతో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ గంట పాటు చర్చలు జరిపారు. ఈ భేటీకి టీఆర్ఎస్ నేత, ఎస్సీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి కూడా హాజరయ్యారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని చెబుతున్నప్పటికీ.. అసంతృప్తి నేతలతో జూపల్లి భేటీ టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీనియర్ నేతగా, మంత్రిగా చక్రం తిప్పిన జూపల్లి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. తనపై గెలిచిన హర్షవర్దన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో.. అప్పటినుంచి పార్టీలో తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందనే అసంతృప్తిలో జూపల్లి ఉన్నారు. నిజానికి జూపల్లికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. అదేమీ కార్య రూపం దాల్చలేదు. దీంతో ఏ పదవి లేకుండానే పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో హర్షన్ వర్దన్ రెడ్డి వర్గానికి, జూపల్లి వర్గానికి ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నాయి.
తాజాగా జూపల్లి ఉన్నట్టుండి ఖమ్మం టీఆర్ఎస్ అసంతృప్తి నేతలతో భేటీ అవడంలో మతలబు ఏంటన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీలో ప్రాధాన్యం కోల్పోయారు. పాలేరులో ఆయనపై గెలిచిన ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిపోయారు. అప్పటి నుంచి పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గిందనే అసంతృప్తిలో తుమ్మల ఉన్నారు. తుమ్మలకు ఎమ్మెల్సీ దక్కవచ్చుననే ప్రచారం జరిగినప్పటికీ కేసీఆర్ ఆయనకు పదవి కట్టబెట్టలేదు.
ఇక పొంగులేటి శ్రీనివాస రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో అప్పటినుంచి ఏ పదవి లేకుండానే పార్టీలో కొనసాగుతున్నారు. జూపల్లితో భేటీపై ఇప్పటికైతే తుమ్మల, పొంగులేటి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. జూపల్లి అనుచరులు చెబుతున్నట్లు ఈ భేటీలకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదా.. లేక తెర వెనుక రాజకీయం వేరే ఉందా.. వేచి చూడాలి..!!
Also Read: UP Polls 2022: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారు.. అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు
Also Read: Russia Ukraine War: ఎట్టకేలకు సుమీ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook