కేంద్ర కేబినెట్‌కి ఇద్దరు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసిన అనంతరం మారుతున్న రాజకీయ పరిణామాలపై దృష్టిసారించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధానితో జరిగిన ఫోన్ సంభాషణను అందుబాటులో వున్న ఏపీ కేబినెట్ మంత్రులకు వివరించారు. ఏపీ ఎదుర్కుంటున్న సమస్యలపై కూర్చొని మాట్లాడుకుని వుండుంటే సమస్య పరిష్కారం అయ్యేది కదా అని ప్రధాని తనతో అభిప్రాయపడినట్టుగా సీఎం చంద్రబాబు సహచర మంత్రులకు తెలిపారు. ప్రధాని మోదీ మాటలకు స్పందించిన తాను.. ఇప్పటికే నాలుగేళ్లు ఓపిక పట్టామని, ఇక చేసేదేమీ లేని పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పినట్టు మంత్రులకు స్పష్టంచేశారు.
ఇదే విషయమై మాట్లాడేందుకు ప్రధాని అక్కడికి పిలిచినప్పటికీ, ఇక ఇప్పుడు వెనక్కి తగ్గే పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్పినట్టు సీఎం వివరించారు. ఆంధ్రుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ తీసుకున్న నిర్ణయం కనుక ఇక దీనిలో మార్పు వుండదు అని ప్రధానికి తేల్చి చెప్పానని అన్నారు. ఇప్పుడైనా పరిస్థితి ఏమీ చేయిదాటిపోలేదని, ఆంధ్ర ప్రదేశ్‌కి ఏమైనా మేలు చేయాలని భావిస్తే, చేయండి అని తాను ప్రధానిని కోరినట్టు చంద్రబాబు తెలిపారు.