తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో కీలక మలుపు తిరిగింది. కేసులో ఏ4 నిందితుడైన జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తాను అప్రూవర్‌గా మారుతానంటూ పిటీషన్ వేశారు. అన్ని విషయాలు అత్యున్నత న్యాయస్థానంలోనే చెబుతానని మత్తయ్య అంటున్నారు. తనను చంపడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని లేఖలో విన్నవించారు.
టీడీపీ, టీఆర్ఎస్‌లు తనను వేధిస్తున్నాయని, తనకు అప్రూవర్‌గా మారే అవకాశం ఇవ్వాలని కోరారు. తనను ఉపయోగించుకుని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఇరికించాలన్న ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ కేసుకు, తనకూ ఎటువంటి సంబంధమూ లేదన్నారు. వాస్తవాలను బయటకు చెప్పే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పౌరులకు ఇచ్చిన రాజ్యాంగ హక్కును కాపాడండంటూ లేఖలో కోరారు.
క్రైస్తవ సమస్యలపై మాట్లాడడానికే తాను స్టీఫెన్‌ను కలిశానని మత్తయ్య స్పష్టం చేశారు. కేసు హైకోర్టులో ఉన్నప్పుడు టీడీపీ తనకు సహకరించిందని, సుప్రీంకోర్టులో తనకు ఎవరూ సహకరించలేదని అన్నారు. తనకు కేటీఆర్ ఫోన్ చేసిన సమయంలో ఆయనను ఇరికించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నించిందని పేర్కొన్న మత్తయ్య, ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ గురించి కొన్ని వాస్తవాలు బయటకు చెప్తానని లేఖలో పేర్కొన్నారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పజెప్పాలని, అప్పుడు మాత్రమే రహస్యాలు బయటకు వస్తాయనన్నారు.
ఓటుకు నోటు కేసులో కీలక మలుపు