వైకాపా అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఎంపీలతో రాజీనామాలు చేయిస్తానంటూ నాటకాలు ఆడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.
తెదేపా రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ఈ విమర్శలు చేశారు. టీడీపీ కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయం వల్ల కలిగిన నష్టాలను కేంద్రం ఎంతవరకు పూడుస్తుందో మార్చి 5వ తేది వరకు వేచిచూస్తుందని చంద్రబాబు తెలిపారు.
ఈ సందర్భంగా జగన్ బీజేపీతో జతకట్టబోతున్నారంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని చంద్రబాబు చదివి వినిపించారు. టీడీపీ ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తుందని.. జగన్‌లా లాలూచీ పడి కేసులు కొట్టివేయించుకోవడం కోసం కుటిల రాజకీయాలు చేయదని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.
అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు ఎవరూ అడగకుండానే వైకాపా సభ్యులు వెళ్లి ఎన్డీఏకి మద్దతు ఇచ్చారని.. అలాగే పవన్ కళ్యాణ్ తమవాడే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. వైకాపా ఇప్పటికైనా కుటిల రాజకీయాలు మానాలని చంద్రబాబు ధ్వజమెత్తారు.