ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం గ్రాంట్స్ కింద పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.417.44 కోట్లు విడుదలకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. రెండు వారాల క్రితమే ఈ ఫైలుపై సంతకం చేసినట్టు కేంద్రం నుంచి రాష్ట్ర జలవనరులశాఖ అధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఏపీ అధికారవర్గాలు, ప్రభుత్వ పెద్దలకి తెలియజేసినట్టు తెలుస్తోంది.
నిధుల విడుదలకు ముందు పద్ధతి ప్రకారం కేంద్రం పంపించిన ఉత్తర్వులను జాతీయ జల అభివృద్ధి సంస్థ నాబార్డుకు పంపించాల్సి వుంటుంది. ఆ తర్వాత నాబార్డు నుంచి నిధులు విడుదల అవ్వాల్సి వుంటుంది. అవి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అక్కడి నుంచి రాష్ట్ర జలవనరులశాఖకు అందడం జరుగుతుంది.
అయితే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి, తాజా నిరసనలకు ఏ సంబంధం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం బడ్జెట్ ప్రకటించిన తర్వాత ఒకవేళ ఏపీ నుంచి ఏమైనా అసంతృప్తి వ్యక్తమైనా.. ''తాము చిత్తశుద్ధితో వున్నాం కనుకే ఈ నిధులు విడుదల చేశాం'' అని కేంద్రం తమని తాము సమర్థించుకునే పథకంలో భాగంగానే ఈ నిధుల విడుదల జరిగిందా అనే సందేహాలూ వినిపిస్తున్నాయి.
కేంద్ర జలవనరులు, గ్రామీణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో గురువారం రాతపూర్వకంగా ఇచ్చిన సమాచారం ప్రకారం పోలవరం ప్రాజెక్టు టైమ్ లైన్లో కొన్ని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి:
> 2010-11 నాటి అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.16010.45 కోట్ల వ్యయానికి ఆమోదం లభించింది.
> ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర సహాయం వంతుగా అందాల్సి వున్న రూ 562.47 కోట్ల మొత్తం 2014లో మార్చి 31 నాటికి అందాయి.
> పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించిన అనంతరం అప్పటికి ప్రాజెక్టు వ్యయం ఎంతైతే మిగిలివుందో.. ఆ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని అప్పట్లో కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్, 2014 నుంచి కేంద్రం అందించే 100శాతం ఆర్థిక సహాయం అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టంచేసింది.
> 2014 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 మధ్య కాలంలో కేంద్రం రూ. 3364.16 కోట్ల నిధులు విడుదల చేసింది.
> 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను 979.36 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం.. మరో రూ.1020.64 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.
> ఏపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిన ప్రతీసారి.. పోలవరం ప్రాజెక్టుని నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు అన్నివిధాల కృషి చేస్తున్నామని కేంద్రం ప్రకటిస్తూ వస్తోంది.
> ఏపీ భారీ నీటి పారుదల శాఖ గతంలో విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం 2019నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సి వుంది.