పాకిస్తాన్లో పాష్టున్ వర్గానికి చెందిన పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇస్లామాబాద్ ప్రెస్ క్లబ్ బయట బైఠాయించారు. తమ వర్గపు హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని వారు ఆరోపించారు. ఇటీవలే తమ మద్దతుదారుడు నకీబ్ మషూద్ని పాక్ పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో దారుణంగా హత్య చేశారని పేర్కొంటూ.. మషూద్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
ఉగ్రవాది గ్రూపులతో కలిసి పనిచేస్తున్నాడని మషూద్ని మట్టుబెట్టామన్న పోలీసుల వాదనలో వాస్తవం లేదని..దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలని పాష్టున్ల నాయకులు కోరారు. సింధ్ ప్రావిన్సులో ఇటీవలే జరిగిన ఈ ఘటనపై స్థానిక ప్రభుత్వం ఇప్పటికే ఎంక్వయరీ వేసింది. అయితే ఇన్వెస్టిగేటివ్ అధికారులు కూడా మషూద్ను హతమార్చడాన్ని నకిలీ ఎన్‌కౌంటర్‌గా తేల్చడంతో పాష్టున్లు వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ముఖ్యంగా పాష్టున్లు వర్గానికి చెందిన యువ వాలంటీర్లు పాకిస్తాన్ సెక్యూరిటీ ఏజెన్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 10,000 మంది వాలంటీర్లు ఇస్లామాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్లో మనుష్యులు నివసించే చోట్లలో కూడా ల్యాండ్ మైన్లు, బాంబులు పెట్టడం ఈ ప్రభుత్వానికి దినచర్యగా మారిందని.. ఇలాంటి ప్రభుత్వ వైఖరి వల్ల ఎందరో ప్రజలు చనిపోతున్నారని వారు ఆరోపించారు. తమ బాధలను ఐక్యరాజసమితి విని, పాకిస్తాన్ పై తగిన ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. గత 15 సంవత్సరాలుగా పాకిస్తాన్ భద్రత పేరుతో తమపై చేస్తున్న దాడులకు హద్దే లేదని పాష్టున్ల నాయకులు తెలిపారు.