'ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కి మార్కెట్ లేదు.. ఇక ఆమె పని అయిపోయింది' అని అనుకునేవాళ్లందరి నోళ్లు మూయిస్తూ ఆమె తన డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని మళ్లీ నిరూపించుకుంది. ప్రస్తుతం అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'ఫ్యనీ ఖాన్' సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఐష్.. అదే చిత్ర నిర్మాణ సంస్థలో మరో రెండు చిత్రాలకి సైన్ చేసింది. అందులో ముందు తెరకెక్కనున్న చిత్రం 'రాత్ ఔర్ దిన్'. 1967లో అలనాటి స్టార్ హీరోయిన్ నర్గీస్ దత్ నటించిన రాత్ ఔర్ దిన్ సినిమాను రీమేక్ చేసేందుకు ముందుకొచ్చిన నిర్మాత ప్రేరణ అరోరా.. ఆ సినిమాలో నర్గీస్ పోషించిన పాత్రను ఈ రీమేక్‌లో ఐష్‌ని చేయాల్సిందిగా కోరారు. అయితే, ఆ సినిమాకు సైన్ చేయడానికి ఐష్ అక్షరాల రూ.10 కోట్లు డిమాండ్ చేశారు.
ఐష్ తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అంత పారితోషికం డిమాండ్ చేయడం ఏంటంటూ కొంతమంది నోళ్లు వెళ్లబెట్టారు. కానీ వాస్తవానికి ఐష్ అడిగిన పారితోషికం సరైనదే అని ఆమెని వెనకేసుకొచ్చే వాళ్లూ లేకపోలేదు. ఎందుకంటే రాత్ ఔర్ దిన్ సినిమాలో ఐష్ ద్విపాత్రిభినయం చేయాల్సి వుంటుంది. పైగా భిన్న మనస్తత్వాలు కలిగిన పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఎంతో ప్రిపేర్ అవ్వాల్సి వుండటంతోపాటు ఆ సినిమా పూర్తయ్యే వరకు ఐష్ మరే ఇతర ప్రాజెక్టు చేయడానికి కూడా వీలు దొరకదు. అందుకే ఆమెకు అంత పారితోషికం ఇవ్వడంలో ఏ మాత్రం తప్పు లేదనేది వారి అభిప్రాయం.
రాత్ ఔర్ దిన్ సినిమాను నిర్మించనున్న ప్రేరణ అరోరా సైతం ఐష్ అడిగిన మొత్తానికి ఏ మాత్రం వెనుకాడకుండా వెంటనే ఎస్ చెప్పేశారంటే ఆ సినిమాలో ఆమె పాత్రకు వుండే ప్రాధాన్యత ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. రాత్ ఔర్ దిన్ సినిమాలో తన ప్రతిభకిగాను నర్గిస్ దత్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ గెలుచుకోవడం విశేషం.