కోవిడ్ 19 వైరస్ ఆ రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కూాడా కారణమవుతోంది. తమ వ్యవహారాల్లో కలగజేసుకోవద్దంటూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి..మరో రాష్ట్ర సీఎంను హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యవహారంలో పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల మద్య రాజకీయ వివాదం నెలకొంది. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తికి సంబంధించి...తమ రాష్ట్ర ప్రజల్లో అపోహలు పెంచడం మానుకోవాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను...పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ హెచ్చరించారు. ఓ వైపు కరోనా వైరస్ తో పోరాడుతుంటే...సరిహద్దు రాష్ట్రంలో సమస్యలు సృష్టించేందుకు భారత వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్రలో పావుగా మారవద్దని హితవు పలికారు. కోవిడ్ 19 పై నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తూ అరెస్టైన ఆప్ కార్యకర్తకు ఎవరెవరితో సంబంధాలున్నాయో తేల్చాలని అమరిందర్ సింగ్ ...పంజాబ్ డీజీపీను ఆదేశించారు.
గ్రామాల్లో నివసిస్తున్న ప్రజల ఆక్సిజన్ స్థాయిని పరీక్షించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ...ఇటీవల పంజాబ్ లో తన పార్టీ కార్యకర్తల్ని కోరారు. అదే సమయంలో పంజాబ్ లో కోవిడ్ 19 పై తప్పుదారిపట్టించే నకిలీ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందులో ఓ వీడియో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా అనుమానాలున్నాయి. ఈ వీడియోను ఆప్ కార్యకర్త వైరల్ చేసినట్టు ఆరోపణలున్నాయి. దాంతో అతన్ని పంజాబ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్...ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను హెచ్చరించారు.