వాషింగ్టన్: వీసాల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు ఎడాపెడా ఆంక్షలు విధించి విదేశీయులకు తెగ ఇబ్బంది పెడుతున్న ట్రంప్ ప్రభుత్వం..విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పన్నుల సంస్కరణ బిల్లు- టాక్స్ కట్స్ అండ్ జాబ్స్ ఏక్ట్ ను అమెరికా సెనెట్ ఆమోదించింది. తాజా నిర్ణయం వల్ల భారతీయ విద్యార్ధులతో పాటు పలుదేశాల విద్యార్ధులపై పెను భారం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అసలు బిల్లులో ఏముందంటే..?
కొత్త పన్నుల వ్యవస్థలో విద్యార్థులకు ఇచ్చే ఫీజు మినహాయింపుల మీద పన్ను వేశారు. మినహాయించిన ఫీజు మీద ఇన్నాళ్లూ పన్ను ఉండేది కాదు. ఇప్పుడు దాన్ని కూడా పన్ను పరిధిలో చేర్చారు. దీంతో విదేశీ విద్యార్ధులకు ఇచ్చే ఫీజు మినహాయింపు ఇక ఉండబోదన్న మాట. ఈ నిర్ణయం ట్యూషన్ ఫీజుల పెంపునకు దారి తీస్తాయంటున్నారు విద్యారంగ నిపుణులు.
కలగా మారనున్న అమెరికా విద్యా
ప్రతీ ఏటా అమెరికాలో విద్య అభ్యసించేందుకు భారతీయ విద్యార్ధులు అక్కడికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికా వెళ్లి చదువుకోవాలనుకొనే వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా తాజా నిర్ణయం వల్ల అమెరికా వెళ్లి విద్యనభ్యసించే విదేశీ విద్యార్ధుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు