'కరోనా వైరస్' వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐతే లాక్ డౌన్ 3.0ను ఎత్తేసే అవకాశం ఉందా..? ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఏం చెప్పనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తృతి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే విషయాలపై ఆరా తీస్తారు. కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించిన తర్వాత ఇప్పటికి నాలుగు సార్లు ప్రధాని నరేంద్ర మోదీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇవాళ్టి సమావేశం ఐదోది కావడం విశేషం.
ఇప్పటికే పరిమిత ఆంక్షలు విధించి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఆర్ధిక వ్యవస్థ నానాటికీ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తేస్తే బాగుంటుందనే ఆలోచన సర్వత్రా నెలకొంది. కానీ మరోవైపు కరోనా మహమ్మారి ఇప్పటి వరకు లొంగి రావడం లేదు. రోజూ దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ఏం చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
లాక్ డౌన్ ఎత్తేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి..? వాటిని ఎలా ఎదుర్కోవాలి..? భవిష్యత్ కార్యాచరణను ఎలా నిర్దేశించాలి..? అనే అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం ఉంది. కంటైన్ మెంట్ జోన్లను ఎలా నిర్వహించాలి..? అక్కడ కార్యకలాపాలకు ఎలా అనుమతులు ఇవ్వాలనే అంశంపైనా చర్చించనున్నారు. ప్రధాని నిర్వహించనున్న వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా పాల్గోనున్నారు.
భారత దేశంలో నిన్నటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 62 వేల 939కు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి 2 వేల 109 మంది బలయ్యారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
లాక్ డౌన్ ఎత్తేస్తారా..?