ఆధార్ కార్డుకు ఇంకా దరఖాస్తు చేయని వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 30వ తేదీ వరకు ఉన్న గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించారు. కేంద్ర సమాచార శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీచేసింది.
కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పొందాలంటే అందుకు ఆధార్ తప్పనిసరి చేశారు. రాయితీపై సిలిండర్, చౌక దుకాణాల్లో సరుకులు, ఎరువులు.. ఇలా ప్రభుత్వం అమలు చేసే ఏ పథకానికైనా ఆధార్ కార్డు తప్పనిసరైంది. దీంతో ఆధార్ కార్డు లేని వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకొన్న మోడీ సర్కార్ ఈ మేరకు గడువు పొడగింపు నిర్ణయం తీసుకొంది.