న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం.. CAA-2019కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదమై చట్టంగా రూపొందినా.. నిరసనలపర్వం ఆగడం లేదు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. ఉత్తరప్రదేశ్ సంభల్‌లో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు.. ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు.
గుజరాత్‌లోనూ పరిస్థితులు చేయి దాటిపోయాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ఆందోళన చేస్తోన్న వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ వాహనాలను ఉద్యమకారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రకోట వద్ద నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఆందోళనకారులు పట్టించుకోవడంలేదు. ఐపిసి 144 సెక్షన్ విధించినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి ఉమర్ ఖలీద్ కూడా ఉన్నారు.
#WATCH Gujarat: Police resort to lathi-charge during protest called by different Left parties, over #CitizenshipAmendmentAct, in Ahmedabad. The protesters were allegedly blocking police vehicle when the the police resorted to lathi charge to disperse them. pic.twitter.com/tTIWJXsf8T
— ANI (@ANI) December 19, 2019
మరోవైపు ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని 19 మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పలు బస్సుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బెంగళూరులో చరిత్రకారుడు రామచంద్ర గుహను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి: అరవింద్ కేజ్రీవాల్
దేశంలో శాంతిభద్రతలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం- 2019కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల వల్ల దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. దేశంలో పౌరుల్లో ఒక రకమైన భయం ఉందని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని.. దీన్ని అమలు చేయవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి కోరారు.
పౌరసత్వ సవరణ చట్టం: రెచ్చిపోయిన ఆందోళనకారులు.. వాహనాలకు నిప్పు