కర్నూలు జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్.. టీడీపీ నేత దారుణ హత్య.. మొబైల్ వీడియోలో రికార్డయిన మర్డర్

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మళ్లీ జడలు విప్పింది. కొలిమిగుండ్ల మండలం బెలుముగుహల వద్ద టీడీపీ నేత సుబ్బారావును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. సుబ్బారావు ఓ హోటల్ వద్ద టీ తాగుతుండగా గమనించిన ప్రత్యర్థులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Last Updated : Dec 18, 2019, 01:50 AM IST
కర్నూలు జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్.. టీడీపీ నేత దారుణ హత్య.. మొబైల్ వీడియోలో రికార్డయిన మర్డర్

కర్నూలు: జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మళ్లీ జడలు విప్పింది. కొలిమిగుండ్ల మండలం బెలుముగుహల వద్ద టీడీపీ నేత సుబ్బారావును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. సుబ్బారావు ఓ హోటల్ వద్ద టీ తాగుతుండగా గమనించిన ప్రత్యర్థులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేట కొడవళ్లతో నరికినప్పటికీ.. వారి పగ చల్లారినట్లు కనిపించలేదు. కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావంతో సుబ్బారావు నేల మీద పడి కొట్టుకుంటుండగానే అదే సమయంలోనూ పలువురు ప్రత్యర్థులు అతనిపై పెద్ద పెద్ద బండరాళ్లతో దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నడిరోడ్డుపై.. అది కూడా పట్టపగలే..  అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. సుబ్బారావు కొలిమిగుండ్ల మండలం చింతలాయిపల్లె గ్రామానికి చెందిన వారు. మరోవైపు సుబ్బారావును హత్య చేస్తున్న  సమయంలో ఓ వ్యక్తి సెల్ ఫోన్‌లో ఆ ఘటనను చిత్రీకరించారు. ఇప్పుడు ఈ వీడియో కేసు దర్యాప్తులో కీలకంగా మారనుంది.  

కన్నీటి సంద్రంలో కుటుంబసభ్యులు..
సుబ్బారావు హత్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనపై ప్రత్యర్థులు కిరాతకంగా దాడి చేసి హత్య చేయడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  

హత్యారాజకీయాలపై భగ్గుమన్న టీడీపీ...  
టీడీపీ కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేసిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఇప్పటికే 13 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని.. 600 మందిపై దాడులు జరిగాయని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు.

Trending News