న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంపై సీబీఐ నమోదు చేసిన ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరంకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం చిదంబరం బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు... ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ హృషికేష్ రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం చిదంబరంకు బెయిల్ మంజూరుచేసింది. లక్ష రూపాయల సొంత పూచీకత్తుతోపాటు విచారణకు అందుబాటులో ఉండాలనే షరతుపై దేశ అత్యున్నత న్యాయస్థానం చిదంబరంకు బెయిల్ మంజూరుచేసింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసే వరకు చిదంబరంకు బెయిల్ మంజూరు చేయకూడదని.. లేదంటే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని సీబీఐ తరపు న్యాయవాది తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు అనుమతి లేనిదే చిదంబరం దేశం విడిచి ఎక్కడికీ వెళ్లరని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానానికి తెలిపారు. దీంతో కోర్టు అనుమతి లేనిదే దేశం ఎక్కడికి వెళ్లరాదనే షరతుపై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ఇప్పటివరకు తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే