హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ వరకు తెలంగాణలో విద్యా సంస్థలకు దసరా సెలవులను పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో శనివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమ్మె కాలంలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది.
ఈ సందర్భంగా స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విద్యార్థిని, విద్యార్థులకు అసౌకర్యానికి గురికాకుండా దసరా సెలవులను సైతం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అదే సమయంలో సెలవుల పొడిగింపు కారణంగా విద్యార్థుల చదువులపై ప్రభావం పడకుండా ఈ విద్యా సంవత్సరంలో రెండో శనివారాల సెలవులను రద్దు చేశారు. దీంతో ఇకపై ప్రతీ నెల రెండో శనివారం కూడా విద్యా సంస్థలు పని చేయనున్నాయి.
దసరా సెలవులను పొడిగించిన సర్కార్