తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.18 లక్షల వరకు రుణాలు పొందిన ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్న బ్యాంక్ అప్రైజర్ శివ కుమార్‌తో పాటు అతడికి సహకరించిన మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరి ఎస్బీఐ బ్యాంక్‌లో అప్రైజర్‌గా విధులు నిర్వహిస్తున్న శివకుమార్ అనే వ్యక్తి.. తన బంధువులు, స్నేహితులను అడ్డం పెట్టుకుని వారిచేత నకిలీ బంగారం తనఖా పెట్టించాడు. కిలోకి పైగా నకిలీ బంగారం తనఖా పెట్టించి మొత్తం 18 లక్షల రుణం పొందేందుకు సహకరించాడు. అలా స్నేహితులు, బంధువులతో చేతులు కలిపి తాను పనిచేస్తోన్న బ్యాంకుకే రూ.18 లక్షల వరకు టోపీ వేశాడు.
అయితే, అది నకిలీ బంగారం అని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు.. రుణం పేరిట తీసుకున్న రూ.18 లక్షలు తిరిగి చెల్లించాల్సిందిగా నిలదీశారు. కొంత సమయం ఇచ్చినప్పటికీ తీసుకున్న రుణాన్ని శివ కుమార్ తిరిగి చెల్లించకపోవడంతో.. చివరికి అధికారులకు పోలీసులను ఆశ్రయించకతప్పలేదు. చంద్రగిరి ఎస్బీఐ మేనేజర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బంగారం అప్రైజర్ శివకుమార్‌తో పాటు ఆయనకు ఈ నేరంలో సహకరించిన బంధువులు, స్నేహితులైన ఎనిమిదిమందిని అరెస్ట్ చేశారు.
నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.18 లక్షల రుణం.. అరెస్ట్!