అమరావతి: చంద్రబాబు ఇల్లు కూల్చేసేందుకు ఏపీ సర్కార్ కుట్రపన్నుతోందనేది అవాస్తవమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఇటీవల జారీచేసిన ఆదేశాలే చివరివని మంత్రి తేల్చిచెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వారం రోజుల తర్వాత చట్టరీత్యా ఏం చేయాలనేది అధికారులే చూసుకుంటారని అన్నారు. చంద్రబాబు అక్రమ నిర్మాణంలో ఉండటమే కాకుండా పైగా తాను ఉంటున్న ఇంటిని ప్రభుత్వమే కూల్చేసేందుకు కుట్రపన్నుతోందని దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాల్లో ఉండొచ్చా లేదా అనే విషయం ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు తెలిదా అని మంత్రి బొత్స నిలదీశారు. నిర్మాణాలు సక్రమమే అని ఇంకా భావించినట్టయితే.. వారు కోర్టుకు వెళ్లొచ్చు అని చెబుతూ.. చంద్రబాబు ఇల్లే కాదు కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తామన్నారు.
ఇదిలావుంటే, మరోవైపు ఇప్పటికే కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలయ్యాయి. సోమవారం ఉదయమే రంగంలోకి దిగిన సీఆర్డీయే అధికారులు పాతూరి గెస్ట్ హౌస్ వద్ద నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. పాతూరి గెస్ట్ హౌస్‌కు గతంలోనే నోటీసులు జారీచేయడం గమనార్హం.
చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూల్చివేతకు కుట్ర ? మంత్రి బొత్స స్పందన