హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలంటే, ఆర్థికంగా నగదు సర్దుబాటు చేసుకోవడం ఎంత కష్టమో.. కొనబోయే స్థలం, ఫ్లాట్ సరైనదేనా కాదా ? వాటికి సంబంధిత అధికార యంత్రాంగం నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అనే వివరాలు తెలుసుకోవడం అంతకన్నా కష్టం. ఫ్లాట్, స్థలం వంటివి కొనేముందు అన్ని విధాల వివరాలు ఆరా తీయకపోతే, ఇక వినియోగదారుడు ఇంటి కోసం కష్టపడి పెట్టినంత ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరేననే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నగరంలోని అనేక చోట్ల కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న అనేక లేఅవుట్లకు అధికారుల నుంచి అన్నిరకాల అనుమతులు లేకపోవడమే అందుకు కారణం. తాజాగా చందానగర్ డిప్యూటీ కమిషనర్ యాదగిరి రావు చేసిన ఓ ప్రకటన ప్రకారం చందానగర్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలోని పలు నిర్మాణాలకు అటువంటి బెడదే తప్పదని తెలుస్తోంది. అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాలు, ప్లాట్లను కొనుగోలు చేయొద్దని చందానగర్ డిప్యూటీ కమిషనర్ యాదగిరి రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
చందానగర్ డిసి యాదగిరి రావు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. హాఫీజ్‌పేట్ సర్వే నంబర్ 78 గోకుల్ ప్లాట్లలో అక్రమ నిర్మాణాలుగా గుర్తించి, కూల్చి వేసిన 91 నిర్మాణాలను తిరిగి కడుతున్నారని, ఆయా నిర్మాణాలకు విద్యుత్ సర్వీస్ కనెక్షన్స్ ఇవ్వొద్దని విద్యుత్ శాఖకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఒకవేళ అక్రమంగా విద్యుత్ కనెక్షన్స్ తీసుకున్నా.. తర్వాత వాటిని తొలగిస్తామని హెచ్చరించారు. చందానగర్ సర్కిల్ ఖానామెట్ అయ్యప్ప సొసైటీలోని పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పటికీ తిరిగి 17 ప్లాట్లలో అక్రమంగా అపార్ట్‌మెంట్లను నిర్మిస్తూ వాటిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని.. వాటిని కొనుగోలు చేసి వినియోగదారులు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవద్దని యాదగిరి రావు సూచించారు.
హైదరాబాద్‌లో ఇక్కడి ఫ్లాట్లు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయొద్దట!