న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, బీజేపి అగ్రనేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీని కడసారి చూసి వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా నేతలు, ప్రముఖులు అరుణ్ జైట్లీ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. బీజేపి ప్రధాన కార్యాలయం నుంచి యమునా నది ఒడ్డున ఉన్న నిగం బోధ్ ఘాట్ వరకు కొనసాగిన అంతిమయాత్ర ఓ జనసంద్రాన్ని తలపించింది. అరుణ్ జైట్లీ చితికి ఆయన కుమారుడు రోహన్ జైట్లీ నిప్పంటించి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.
బీజేపి అగ్ర నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. పార్టీలకతీతంగా భారీ సంఖ్యలో నేతలు తరలి రావడమే అరుణ్ జైట్లీ ఓ అజాత శత్రువు అని, ఆయన అందరివాడు అని చెప్పేందుకు నిదర్శనంగా నిలిచింది.