కశ్మీర్ అంశంపై చైనా ఇచ్చిన కామెంట్ కు భారత్ ఘాటుగా బదులిచ్చింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టవద్దని చైనాకు భారత్ చురకలు అంటింది. కశ్మీర్ అనేది తమ దేశ భూభాగంలో అంతర్భాగమని ..ఈ విషయంలో ఏం చేయాలో తమకు తెలుసు..ఇందులో ఎవరూ తలదూర్చాలని పనిలేదని చైనాకు భారత్ హితవు పలికింది. మోడీ సర్కార్ తీసుకొచ్చిన జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లులో లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా విడదీసే ప్రతిపాదనపై చైనా వ్యతిరేకత వ్యక్తం చేయగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూటిగా బదులిచ్చింది.
చైనా ఏమన్నదంటే ?
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై స్పందించిన చైనా... జమ్ముకశ్మీర్ అంశంపై ఏకపక్ష నిర్ణయాలకు భారత్ దూరంగా ఉండాలని సూచించింది. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతగా విడదీయడం తమకు అంగీకారయోగ్యం కాదని అసంతృప్తిని వ్యక్తం చేసింది. సరిహద్దు వివాదాలను మరింత క్షిష్టతరం చేసే నిర్ణయాలు తీసుకోవద్దని భారత్ కు చైనా ఉచిత సలహా ఇస్తోంది.
చైనా ఉద్దేశం ఇదేనా ?
గత కొద్ది రోజుల క్రితం చేసిన చట్టాల ద్వారా చైనా సార్వభౌమత్వాన్ని భారత్ తక్కువ చేయాలని చూస్తోంది. మరోవైపు నుంచి భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడేందుకు పరోక్షంగా పాక్ ను అస్త్రంలా వాడుకుంటోంది. ఇందులో భాగంగా పాక్ తన మిత్ర దేశంగా పరిగణిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తన మిత్రదేశం పాకిస్థాన్ ప్రయోజనాలు కాపాడేందుకు కుఠిల రాజకీయాలను ప్రదర్శిస్తోంది. అలాగే చైనా-ఇండియా సరిహద్దులోని లద్దాఖ్‌లోని వివాదాస్పద అక్సాయ్‌చిన్ ప్రాంతం ఉండటం వల్ల ఆ దేశం స్పందనకు కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.